రైతు పండగను విజయవంతం చేయండి
అడ్డాకుల: అమిస్తాపూర్‌లో నిర్వహించే రైతుపండగకు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. అమిస్తాపూర్ వద్ద వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, కలెక్టర్ విజయేందిరతో ఏర్పాట్లను, సభాస్థలి, హెలీప్యాడ్‌లను పరిశీలించారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి వ్యవసాయ రంగానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ రంగానికి కేటాయించని విధంగా వ్యవసాయానికి రూ.76 వేల కోట్లు వెచ్చించిందని చెప్పారు. రైతు సదస్సులో రైతు భరోసా, రూ.2 లక్షల రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన చేస్తారన్నారు.
పకడ్బందీగా ఏర్పాట్లు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): రైతును రాజు చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన అమిస్తాపూర్‌లో రైతు పండగ ఏర్పాట్లను పరిశీలించి.. కలెక్టర్ విజయేందిరను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రైతు స్టాళ్లు, అవగాహన సదస్సు వేదిక, పబ్లిక్ మీటింగ్ ఏర్పాట్లు, రాష్ట్రంలోని నలుమూలల నుంచి రానున్న రైతులకు వాహన పార్కింగ్, భోజన ఏర్పాట్లను పరిశీలించి.. పకడ్బందీగా చేయాలని సూచించారు. రైతులు పండించిన పంటలను ప్రదర్శించుకోడానికి దాదాపు 120 స్టాళ్లు ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు స్టాళ్లు పరిశీలించిన తర్వాత వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, మేధావులు అవగాహన కల్పిస్తారన్నారు. రైతు పండగను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment