బాల్య వివాహాలతోభవిష్యత్ అంధకారం
పాలమూరు: బాల్య వివాహాలు చేసుకుంటే భవిష్యత్ అంధకారం అవుతుందని, దీంతోపాటు అనేక రకాలుగా ఆరోగ్య సమస్యలు వస్తాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర అన్నారు. జిల్లాకేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల డిగ్రీ కళాశాలలో బుధవారం బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. దీంతోపాటు పలు రకాల చట్టాలతోపాటు అమ్మాయిలు చిన్న వయస్సులో వివాహాలు చేసుకోవడం వల్ల జరిగే ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలపై వివరించారు. బాల్య వివాహాలు చేయకుండా ప్రతిఒక్కరూ నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. అమ్మాయి వయస్సు 18 ఏళ్లు నిండక ముందే పెళ్లిళ్లు చేస్తే భవిష్యత్‌లో జరిగే ఆరోగ్య సమస్యలతోపాటు పుట్టబోయే పిల్లలు అనారోగ్యంగా పుట్టడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులు ఎవరైనా పిల్లలపై పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తే బాల్య వివాహాలు చేసుకోమని ధైర్యంగా చెప్పాలన్నారు. చేసుకుంటే భవిష్యత్‌లో జరిగే ఇబ్బందులపై అవగాహన కల్పించాలన్నారు. ఒకవేళ ఎవరైనా ఒత్తిడి చేస్తే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
బాదేపల్లి యార్డుకు పోటెత్తిన ధాన్యం
జడ్చర్ల/ దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు బుధవారం వ్యవసాయ పంట ఉత్పత్తులు పోటెత్తాయి. వివిధ ప్రాంతాల నుంచి 11,519 క్వింటాళ్ల ధాన్యం, 813 క్వింటాళ్ల మొక్కజొన్న విక్రయానికి వచ్చింది. మొక్కజొన్న క్వింటాలు గరిష్టంగా రూ.2,424, కనిష్టంగా రూ.1,989 ధరలు లభించాయి. అలాగే ధాన్యం హంస రకం గరిష్టంగా రూ. 2,386, కనిష్టంగా రూ.1,869, ఆర్‌ఎఆన్‌ఆర్ రకం గరిష్టంగా రూ.2,819, కనిష్టంగా రూ. 1,736, పత్తి గరిష్టంగా రూ.6,716, కనిష్టంగా రూ.3,000, వేరుశనగ గరిష్టంగా రూ.6,496, కనిష్టంగా రూ.5,689 ధరలు లభించాయి.
ఆర్‌ఎన్‌ఆర్ ధర రూ.2,709
దేవరకద్ర మార్కెట్ యార్డులో బుధవారం జరిగిన టెండర్లలో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,709, కనిష్టంగా రూ.2,243 ధరలు నమోదయ్యాయి. హంస ధాన్యం ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.1,929 ఒకే ధర లభించింది.
టీటీడీ ఆధ్వర్యంలో భగవద్గీత కంఠస్థ పోటీలు
స్టేషన్ మహబూబ్‌నగర్: వచ్చేనెల 11న గీతా జయంతిని పురస్కరించుకొని టీటీడీ, హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని ఐదు కేంద్రాల్లో భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ జిల్లా కార్యక్రమ నిర్వాహకులు ఉత్తరాపల్లి రామాచారి తెలిపారు. జిల్లాకేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో బుధవారం భగవద్గీత కంఠస్థ పోటీల బ్యానర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయం (ఆత్మ సంయమున యోగ) యోగంపై పోటీలు ఉంటాయన్నారు. అదేవిధంగా 18 అధ్యాయాలు పూర్తిగా వచ్చిన వారికి కూడా పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నాలుగు విభాగాల్లో భగవద్గీత కంఠస్థ పోటీలు ఉంటాయన్నారు. 6, 7 తరగతులు, 8, 9 తరగతులకు, 18 ఏళ్లలోపు, 18 ఏళ్లుపైబడిన వారికి సంపూర్ణ భగవద్గీత 700 శ్లోకాలపై పోటీలు ఉంటాయని చెప్పారు. ఈ నెల 30న వనపర్తిలోని శ్రీసరస్వతి శిశుమందిరం ఉన్నత పాఠశాల, డిసెంబర్ 1న నారాయణపేట జిల్లా మరికల్‌లోని శ్రీవాణి హైస్కూల్, 4న నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని సుభాష్‌నగర్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం, 7న జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రం గంజిపేటలోని శ్రీసరస్వతి టాలెంట్ హైస్కూల్, 10న మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో కంఠస్థ పోటీలు ఉంటాయన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు అందజేస్తామన్నారు. పూర్తి వివరాల కోసం సెల్ నంబర్లు 93475 40005, 73967 11574లను సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment