అర్హులు ఓటరుగా నమోదు చేసుకోవాలి
● ఓటరు జాబితా పరిశీలకులు కే.సురేంద్రమోహన్
మంచిర్యాలఅగ్రికల్చర్: వచ్చే జనవరి ఒకటి నాటికి 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో వివరాలు నమోదు చేసుకోవాలని ఓటరు జాబితా పరిశీలకులు కే.సురేంద్రమోహన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ మోతిలాల్‌తో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పష్టమైన జాబితా రూపొందించడంలో రాజకీయ పార్టీల సహకారం అవసరమని అన్నారు. ఈ నెల 26న విద్యార్థులు, యువతతో 2కే రన్ నిర్వహిస్తామని, స్వయం సహాయ సంఘాల సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఓటు ఆవశ్యకత, ఓటరు నమోదు జాబితాలో మార్పులు ఇతర అంశాలపై ప్రజలకు వివరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ 397 దరఖాస్తులు రాగా పరిష్కరించామని తెలిపారు. జిల్లాలో ముసాయిదా జాబితా ప్రకారం 3,23,278 మంది పురుషులు, 3,29,924 మంది మహిళలు, 45 మంది ఇతరులు, 39 మంది ఎన్‌ఆర్‌ఐ, 684 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారని, 747 పోలింగ్ కేంద్రాలు గుర్తించామని తెలిపారు. ఈ సమావేశంలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ ఈఆర్‌వోలు శ్రీనివాస్‌రావు, హరికృష్ణ, డి.చంద్రకళ, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment