నేటి నుంచి ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల బంద్
● పరీక్షల బహిష్కరణ కూడా.. ● కేయూ వీసీకి నోటీసు అందజేత
మంచిర్యాలఅర్బన్/కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలు నేటి నుంచి నిరవధికంగా బంద్ చేయనున్నారు. ఈ మేరకు ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ బాధ్యులు సోమవారం యూనివర్సిటీ వీసీ ప్రతాప్‌రెడ్డికి నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ బాధ్యులు మాట్లాడుతూ రెండేళ్ల నుంచి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయడం లేదని, దీంతో తాము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. 90శాతం కళాశాలలు నాలుగు, ఐదు నెలల నుంచి అధ్యాపకులు, ఇతర సిబ్బందికి వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. గత నెలలో 14నుంచి కూడా కళాశాలలు బంద్ చేయగా అదే నెల 17న విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం వారం రోజుల్లోపే విడుదలకు హామీనివ్వడంతో బంద్ విరమించామని, కానీ నేటికీ చెల్లించలేదని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించే వరకూ కళాశాలలు తెరవబోమని స్పష్టం చేశారు. కేయూ పరిధిలో ఈ నెల 26 నుంచి జరిగే డిగ్రీ కోర్సుల మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షలు కూడా బహిష్కరించనున్నామని స్పష్టం చేశారు. వీసీకి నోటీసు అందజేసిన వారిలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.రవీంద్రనాథ్, బాధ్యులు జి.వేణుమాధవ్, గోలి వెంకట్, ఎం.శ్రీనివాస్, కృష్ణమోహన్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment