అర్హులకు సంక్షేమ ఫలాలు
● కలెక్టర్ రాహుల్ రాజ్ ● ప్రజాపాలన కళాయాత్ర ప్రారంభం
మెదక్‌జోన్ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రతీఒక్కరికి అందేలా కృషి చేస్తున్నామని కలెక్టర్ రాహుల్‌రాజ్ పేర్కొన్నారు. మంగళవారం ప్రజాపాలన కళాయాత్రను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి నుంచి డిసెంబర్ 7 వరకు కళాయాత్ర ఉత్సవాలు జరుగుతాయన్నారు. జిల్లాలోని మెదక్, నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్ మున్సిపాలిటీలు, 21 మండలాలు సహా ఆయా గ్రామాల్లో ప్రభుత్వ అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలైన మహాలక్ష్మి, ఇందిరా మహిళాశక్తి, గృహజ్యోతి, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లపై ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. మెదక్, నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్ మున్సిపాలిటీలోని ఆయా వార్డుల్లో, ప్రతీ మండలం నుంచి మూడు గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి రామచంద్రరాజు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్టీసీ డీఎం సంబంధిత తెలంగాణ సాంస్కృతిక కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
కళాశాల నిర్వహణకు అద్దెభవనం పరిశీలన
నర్సింగ్ కళాశాల నిర్వహించేందుకు గాను అద్దె భవనం కోసం అన్నిరకాలుగా యత్నిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. మంగళవారం ఆయన వైద్య కళాశాలను పరిశీలించారు. పారా మెడికల్ డిప్లొమా ఇన్‌ల్యాబ్ టెక్నీషియన్, అనస్తీషియా టెక్నీషియన్ కోర్సులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను కౌన్సెలింగ్ ద్వారా రిక్రూట్మెంట్ చేయాలన్నారు. ఈ కళాశాల నిర్వహణ కోసం అద్దె భవనాన్ని పరిశీలించారు. కళాశాలకు మిషన్ భగీరథ తాగునీటి వచ్చేలా చూడాలని సూపరింటెండెంట్ అభ్యర్థన మేరకు మిషన్ భగీరథ అధికారులతో ఆయన మాట్లాడారు. నర్సింగ్ విద్యార్థులు చేరుతున్నారని డిసెంబర్ నాటికి క్లాసులు ప్రారంభించాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ కమలాదేవి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment