‘గూడెంగడ్డ’ ఆదర్శనీయం
● అదనపు కలెక్టర్ నగేశ్ ప్రశంసలు ● ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్మానం
నర్సాపూర్ రూరల్: జిల్లా ప్రజలంతా నర్సాపూర్ మండలం గూడెంగడ్డ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. మంగళవారం ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్మానించుకునేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. గ్రామస్తులంతా ఒక తాటిపైకి వచ్చి స్టీల్ బ్యాంకు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. శుభకార్యాలు జరిగినప్పుడు ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులకు బదులుగా స్టీల్ ప్లేట్లు గ్లాసులను వినియోగించాలని నిర్ణయించుకున్నారన్నారు. ఇప్పటికే గ్రామంలో మద్య నిషేధం, వంద శాతం మరుగుదొడ్డిల నిర్మాణం, తడిపొడి చెత్త వేరు చేయడం, 100 శాతం ఇంటి పన్ను చెల్లించడం, ఇప్పుడు ప్లాస్టిక్ రహిత గ్రామంగా చేయాలని నిర్ణయించుకోవడం మంచి శుభపరిణామం అన్నారు. అధికారులు గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల వినియోగాన్ని పరిశీలించారు. స్వచ్ఛభారత్ పథకం కింద మరుగుదొడ్లు లేని తుల్జారాంపేట, కాజీపేట గ్రామాలకు చెందిన మహిళలకు రూ.12 వేలు చెక్కులను అందజేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. స్వచ్ఛతపై విద్యార్థుల ఆటపాటలు అందరినీ అలరించాయి. ప్రతిభచూపిన ఆరుగురికి తహసీల్దార్ శ్రీనివాస్ ఒక్కొక్కరికీ రూ.6 వేల పురస్కారం అందజేశారు. ముందుగా ఇంటింటా తడి పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, ఆర్డీఓ మహిపాల్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ మధులత, ఏపీఓ అంజిరెడ్డి, ఐకేపీ ఏపీఎం గౌరీశంకర్, కార్యదర్శి నగేశ్, హెచ్‌ఎం స్వప్న పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment