ప్రసూతి సేవలు భేష్
● అధిక శాతం గర్భిణులు ప్రభుత్వాస్పత్రికే రాక ● మెదక్ ఎంసీహెచ్‌లోనెలకు 350కిపైనే కాన్పులు ● వాటిలో సగం సాధారణ ప్రసవాలు
నెలవారీ వివరాలు..
నెల నార్మల్ ఆపరేషన్ మొత్తం
ఏప్రిల్ 148 167 315
మే 150 152 302
జూన్ 111 139 250
జులై 134 162 296
ఆగస్టు 137 166 303
సెప్టెంబర్ 169 151 320
అక్టోబర్ 153 188 341
ఒకప్పుడు సర్కారు దవాఖానలో కాన్పు అంటే గర్భిణి భయపడే దుస్థితి. ఇప్పుడు పేద, మధ్యతరగతి, ధనిక అనే తేడా లేకుండా నూటికి 90 శాతానికిపైగా గర్భిణులు ప్రభుత్వాస్పత్రిలోనే ప్రసవిస్తున్నారు. ఏదైనా సమస్య ఉంటే తప్ప అన్ని కూడా సాధారణ కాన్పులు చేస్తున్నారు వైద్యులు. అందులోను మెదక్ ఎంసీహెచ్ అందరి మన్ననలు పొందుతోంది.
మెదక్‌జోన్: మెదక్ జిల్లా కేంద్రంలోని పిల్లకొటాల్ శివారులో 2022లో రూ.17 కోట్లతో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించింది. మెదక్ జిల్లాలో పాటు కామారెడ్డి జిల్లాకు చెందిన గర్భిణులు ఈ దవాఖానాకు వస్తున్నారు. నిత్యం ఇందులో 1000–1500 మందికి ఔట్ పేషెంట్లు (ఓపీ) వస్తుంటారు. రోజుకు 10–15 కాన్పులు.. అదే ఒక నెలకు వచ్చేసరికి 300– 400 పైచిలుకు జరుగుతుంటాయి.
తల్లీబిడ్డలు క్షేమం
ఎంసీహెచ్‌లో వైద్యులు సాధారణ కాన్పులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. తప్పదు అనుకుంటే తప్ప శస్త్రచికిత్స చేస్తున్నారు. దీంతో తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉంటున్నారు. ఆపరేషన్ అయితే తల్లీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుందని, భవిష్యత్‌లో ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తాయని చెబుతున్నారు. నార్మల్ డెలివరీ అయితే మున్ముందు ఎలాంటి సమస్యలు రావని తల్లీబిడ్డలు ఇద్దరు కూడా క్షేమంగా ఉంటారని అందుకే నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యతను ఇస్తున్నట్లు చెబుతున్నారు. అదే ప్రైవేటులో అయితే కాన్పుకు రూ.50 వేలు తప్పనిసరి చెల్లించాల్సిందే. నూటికి 90 శాతం ఆపరేషన్ చేస్తున్నారు. తల్లీబిడ్డల ఆరోగ్యం కన్నా, డబ్బులకే ప్రాధాన్యత ఇస్తారు.
నార్మల్ డెలివరికే ప్రాధాన్యత
సాధారణ కాన్పులకే ప్రాధాన్యతను ఇస్తున్నాం. తప్పని సరైతేనే ఆపరేషన్. ఎంసీహెచ్‌కు మెదక్ జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లాలోని గోపాల్‌పేట, నాగిరెడ్డిపేట, పోచారం తదితర మండలాల నుంచి కాన్పు కోసం వస్తుంటారు.
– డాక్టర్ శివదయాల్ (గైనిక్), జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త
Comments
Please login to add a commentAdd a comment