తిరువళ్లూరు: నామ్ తమిళర్ కట్చి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీ నటుడు సీమాన్ వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్టు ఆరోపణలు చేసిన సినీనటి విజయలక్ష్మి తిరువళ్లూరు మహిళా కోర్టు న్యాయమూర్తి పవిత్ర ఎదుట హాజరై వాగ్మూలం ఇచ్చారు. దీంతో పాటు ఆధారాలను న్యాయమూర్తికి సమర్పించి తనకు న్యాయం చేయాలని కోరారు. నామ్ తమిళర్ కట్చి పార్టీ నేత సీమాన్ తన సహచర నటి విజయలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు ప్రధాన ఆరోపణ. అయితే సీమాన్ మరో యువతిని వివాహం చేసుకున్నాడు.
ఆందోళన చేపట్టిన నటి
దీంతో విజయలక్ష్మి 2011లో వలసరవాక్కం పోలీస్ స్టేసన్‌లో సీమాన్‌పై లైంగిక వేధింపులు, అత్యాచారం చేసినట్టు ఫిర్యాదు చేశారు. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఈ కేసు పెండింగ్‌లో ఉండటంతో పది రోజుల క్రితం విజయలక్ష్మి ఆందోళన బాటపట్టారు. తనకు అన్యాయం జరిగిందని, పోలీసులకు ఫిర్యాదు చేసినా అరెస్టు చేయలేదని ఆరోపణలు చేయడం కలకలం రేపింది. తానూ, సీమాన్ సంవత్సరాల పాటు సహజీవనం చేశామని, చివరకు అతడు తనను మోసం చేశాడని ఆమె మీడియాకు వివరించారు.
పోలీస్ స్టేషన్‌లో 6 గంటలు విచారణ
ఈ ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో వలసరవాక్కం పోలీసులు అప్రమత్తమయ్యారు. వలసరవాక్కం డిప్యూటీ కమిషనర్ ఉమయాల్, అసిస్టెంట్ కమిషనర్ గౌతమ్, సీఐలు మహ్మద్‌బర్గతుల్లా, రాజ్యలక్ష్మి.. విజయలక్ష్మిని శుక్రవారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు తరలించి ఆరు గంటల పాటు విచారణ జరిపారు. అనంతరం తిరువళ్లూరు మహిళా కోర్టు న్యాయమూర్తి పవిత్ర ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి పవిత్ర.. విజయలక్ష్మిని రెండు గంటల పాటు విచారించారు.
ఆధారాలు సమర్పించిన నటి
గతంలో చేసిన ఆరోపణలకు ఆధారాలను ఇవ్వాలని న్యాయమూర్తి కోరగా అందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించారు. తనకు సీమాన్ నుంచి ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించడంతో పాటు అతనిపై చర్యలు తీసుకోవాలని ఆమె కంటతడిపెట్టారు. బాధితురాలు విజయలక్ష్మి ఇచ్చిన వాంగ్మూలాన్ని రికార్డు చేసుకున్న న్యాయమూర్తి ఆమెకు ధైర్యం చెప్పారు. అనంతరం బందోబస్తు నడుమ విజయలక్ష్మిని కారులో చైన్నెకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment