
యాక్షన్ కింగ్‌గా గుర్తింపు పొందిన నటుడు అర్జున్. ఈయనలో మంచి దర్శకుడూ ఉన్నాడనే విషయం తెలిసిందే. చాలా ఏళ్ల పాటు హీరోగా నటించిన ఈయన ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. ఈయనకు ఇద్దరు కూతుర్లు ఉన్న విషయం తెలిసిందే. అందులో పెద్ద కూతురు ఐశ్వర్య అర్జున్ సినీ రంగ ప్రవేశం చేసి తమిళంలో విశాల్ సరసన మదయానై చిత్రంలో కథానాయకిగా నటించారు. అయితే ఆ చిత్రం ఆమె కెరీర్‌కు ఏమాత్రం సాయం చేయలేదు.
దీంతో అర్జున్ తన కూతురు ఐశ్వర్య కథానాయికగా సొల్లితరవా అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తమిళం, కన్నడం భాషల్లో నిర్మించారు. ఆ చిత్రం కూడా ఆశించిన విజయాన్ని సాధించలేదు. చాలా గ్యాప్ తర్వాత అర్జున్ ఆయన కూతుర్ని కథానాయికగా నిలబెట్టడానికి మరో ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి ఆయన పాన్ ఇండియా చిత్రాన్ని చేస్తున్నారు.
తన సొంత బ్యానర్.. శ్రీరామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను కూడా ఆయనే చేపట్టారు. ఐశ్వర్య అర్జున్ కథానాయికగా నటిస్తున్న ఇందులో ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర అన్నయ్య కొడుకు నిరంజన్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. నటుడు సత్యరాజ్, ప్రకాశ్ రాజ్, జయరాం తదితరులతో పాటు అర్జున్ కూడా ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. కేజీఎఫ్ చిత్రం ఫేమ్ హిన్దేష్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
Comments
Please login to add a commentAdd a comment