టైటిల్: భోళా శంకర్
నటీనటులు: చిరంజీవి, తమన్నా, కీర్తీ సురేశ్, సుశాంత్, తరుణ్ అరోరా, మురళీ శర్మ, బ్రహ్మానందం, రఘు బాబు, వెన్నెల కిశోర్ గెటప్ శ్రీను తదితరులు
నిర్మాణ సంస్థ: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
దర్శకత్వం: మెహర్ రమేష్
సంగీతం: మహతి స్వరసాగర్
సినిమాటోగ్రఫీ: డూడ్లీ
ఎడిటర్: మార్తాండ్ కే. వెంకటేశ్
విడుదల తేది: ఆగస్ట్ 11, 2023
‘భోళా శంకర్’ కథేంటంటే..
శంకర్ (చిరంజీవి) తన చెల్లెలు మహాలక్ష్మీ అలియాస్ మహా(కీర్తి సురేశ్) చదువు కోసం హైదరాబాద్ నుంచి కోల్‌కత్తా వస్తాడు. చెల్లిని ఓ కాలేజీలో జాయిన్ చేసి, అదే నగరంలో టాక్సీ డ్రైవర్ ఉద్యోగంలో చేరుతాడు. అక్కడ ఓ గ్యాంగ్ నగరంలోని యువతులను కిడ్నాప్ చేసి బయటి దేశాలకు అమ్మేస్తుంటారు(ఉమెన్ ట్రాఫికింగ్). ఈ కేసు చేధించడంలో పోలీసులు ఆటో, క్యాబ్ డ్రైవర్ల సహాయం తీసుకుంటారు. అనుమానితుల ఫోటోలను చూపించి, వాళ్లలో ఎవరైనా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరతారు. శంకర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు కొంతమంది అమ్మాయిలను రక్షిస్తారు.
పోలీసులకు సమాచారం ఇచ్చింది క్యాబ్ డ్రైవర్ శంకర్ అనే విషయం మహిళల అక్రమ రవాణా(ఉమెన్ ట్రాఫికింగ్) చేసే గ్యాంగ్ లీడర్ అలెగ్జాండర్‌కు తెలుస్తుంది. దీంతో అతన్ని శంకర్‌ని టార్గెట్ చేస్తారు. శంకర్ కూడా అలెగ్జాండర్ మనుషులను ఒక్కొక్కరిని చంపేస్తుంటాడు. అసలు శంకర్ నేపథ్యం ఏంటి? హైదరాబాద్‌లో భోళా భాయ్‌గా పిలవబడే శంకర్.. కోల్‌కత్తాకు ఎందుకు వచ్చాడు? ఉమెన్ ట్రాఫీకింగ్ గ్యాంగ్‌తో శంకర్‌కు ఉన్న వైరం ఏంటి? అనేదే తెలియాలంటే థియేటర్‌లో ‘భోళా శంకర్’ సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ఈ రోజుల్లో రీమేక్ చిత్రాలు చేయడం అంటే పెద్ద సాహసమనే చెప్పాలి. ఒక వేళ రీమేక్ చేసిన ఎలాంటి చిత్రాలు చేయాలి? ఒక భాషలో సక్సెస్ అయి.. ఆ కథ మన ప్రేక్షకులను మెప్పించగలదనే నమ్మకం ఉంటే చేయాలి. అంతేకానీ అక్కడ హిట్ అయింది కదా.. ఇక్కడ కూడా అదే రిపీట్ అవుతుంది అనుకుంటే పొరపాటే. ‘భోళా శంకర్’టీమ్ కూడా ఆ పొరపాటు చేశారేమో అనిపిస్తుంది.
ఎనిమిదేళ్ల కిందట రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తమిళ సినిమా ‘వేదాళం’చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. ఈ కథ అప్పట్లో అక్కడి ప్రేక్షకులకు కొత్తగా అనిపించొచ్చు కానీ తెలుగు ప్రేక్షకులను మాత్రం ఈ తరహా సినిమాలు చాలానే చూశారు. అంతెందుకు మెగాస్టార్ చిరంజీవి ఇటీవల నటించిన ‘వాల్తేరు వీరయ్య’లో ఈ ఛాయలు కనిపిస్తాయి. అక్కడ బ్రదర్ సెంటిమెంట్ అయితే.. ఇక్కడ సిస్టర్ సెంటిమెంట్. అంతే తేడా. కథలో మెయిన్ ట్విస్ట్ ‘ఊసరవెళ్లి’ చిత్రాన్ని గుర్తుకు తెస్తుంది. కథ పాతదైన కథనం అయినా కొత్తగా ఉందా అంటే అదీ లేదు.
శక్తి, షాడో లాంటి డిజాస్టర్లు ఇచ్చి పదేళ్లుగా సినిమాలు తీయని మెహర్ రమేష్‌కు మెగాస్టార్ చిరంజీవితో సినిమా అవకాశం ఇస్తే... దానిని ఎంత సద్వినియోగం చేసుకోవాలి? కానీ మెహర్ రమేశ్ మాత్రం ఆ అవకాశాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. రొటీన్ సన్నివేశాలతో బోరింగ్‌గా సినిమాను తెరకెక్కించాడు. ఒక్కటంటే ఒక్క సీన్ కూడా ఫ్రెష్‌గా, వావ్ అనిపించేలేలా తెరకెక్కించలేదు.
ఉమెన్ ట్రాఫికింగ్ సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కాసేపటికే చిరంజీవి ఎంట్రీ ఉంటుంది. అయితే ఈ ఎంట్రీ కూడా చాలా రొటీన్‌గా ఉంటుంది. ఇక ఆ తర్వాత వెన్నెల కిశోర్‌తో వచ్చే కామెడీ సీన్ అయితే నవ్వించకపోగా, చిరాకుగా అనిపిస్తుంది. బ్రహ్మానందం కోర్టు సీన్ కూడా అంతే. ఒక్క సీన్ తర్వాత ఒకటి వచ్చి వెళ్తుంది కానీ ప్రేక్షకుడు మాత్రం కథలో లీనం కాడు. ఉన్నంతలో ఒకటి, రెండు యాక్షన్ సీన్స్ అలరిస్తాయి. ఇంటర్వెల్ సీన్ కూడా అంతగా ఆకట్టుకోదు.
ఇక సెకండాఫ్‌లో భోళా భాయ్‌గా చిరంజీవి చేసే యాక్షన్ అదిరిపోతుంది. అయితే అక్కడ కూడా కామెడీ వర్కౌట్ కాలేదు. శ్రీముఖి కాంబినేషన్‌లో వచ్చే కామెడీ సీన్స్ అయితే ప్రేక్షకుడి సహనానికి పరీక్షగా మారుతాయి. ‘ఖుషీ’ సీన్ అయితే మరీ ఘోరం. అలాంటి వాటికి మెగాస్టార్ దూరంగా ఉండడమే బెటర్. చిరంజీవితో మాట్లాడించిన తెలంగాణ యాస కూడా అంతగా ఆకట్టుకోదు. దర్శకుడిగా మెహర్ రమేశ్‌ని మెచ్చుకోదగ్గ అంశం ఏంటంటే.. చిరంజీవిని స్టైలీష్‌గా చూపించడంతో పాటు యాక్షన్స్ బ్లాక్స్‌ని చక్కగా తెరకెక్కించాడు. కానీ కామెడీ, ఎమోషన్‌ని హ్యాండిల్ చేయడంలో మాత్రం ఘోరంగా విఫలం అయ్యాడు.
ఎవరెలా చేశారంటే..
మెగాస్టార్ నటన గురించి ఏం చెప్పగలం? ఎలాంటి పాత్రలో అయినా ఆయన పరకాయ ప్రవేశం చేస్తాడు. ఈ చిత్రంలో కూడా శంకర్, భోళా భాయ్‌గా రెండు ఢిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించిన చిరు... ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. డ్యాన్స్ విషయంలోనూ ఎక్కడా తగ్గలేదు. కానీ అక్కడక్కడ అతని వయసు స్పష్టంగా కనిపిస్తుంది.
ఇక లాయర్ లాస్యగా తమన్నా పాటలకే పరిమితం అయింది. ఆమెతో కొన్ని సనివేశాలు ఉన్నా.. అవి అంతగా ఆకట్టుకోలేవు. ఇక ఈ సినిమాలో చిరు తర్వాత బాగా పండించిన పాత్ర కీర్తి సురేశ్‌ది. చిరంజీవి చెల్లెలు మహాగా ఆమె చక్కగా నటించింది. ఆమె వల్లే కొన్ని ఎమెషనల్ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. కీర్తి సురేశ్‌ని పెళ్లి చేసుకోబోయే వ్యక్తి శ్రీకర్‌గా సుశాంత్ ఉన్నంతలో తన పాత్రకి న్యాయం చేశాడు. అతనికి కూడా స్క్రీన్ స్పేస్ తక్కువే. ఇక విలన్‌గా తరుణ్ అరోరా పాత్ర రొటీన్‌గా ఉంటుంది. వెన్నెల కిశోర్, రఘుభాబు, గెటప్ శ్రీను, హర్ష లాంటి కమెడియన్స్ ఉన్నా కామెడీ అంతగా పండలేదు. ఇక బ్రహ్మానందం ఒక సీన్‌కే పరిమితం అయ్యాడు. జడ్జీగా ఆయన చేసిన కామెడీ కూడా వర్కౌట్ కాలేదు.
ఇక సాంకేతిక విషయాలకొస్తే.. మహతి స్వరసాగర్ సంగీతం సినిమాకు మైనస్ అనే చెప్పాలి. పాటలు అంతగా ఆకట్టుకోకపోగా కథకి అడ్డంకిగా అనిపిస్తాయి. నేపథ్య సంగీతం కూడా చిరంజీవి స్థాయిలో లేదు. డూడ్లీ సినిమాటోగ్రఫీ వర్క్ సోసోగానే ఉంది. ఎడిటర్ పనితీరు కూడా అంతే. నిర్మాణ విలువలు మాత్రం సినిమా స్థాయికి తగ్గట్లు చాలా రిచ్‌గా ఉన్నాయి.
-అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment