బిగ్‌బాస్ హౌస్‌లో రెండోవారమే ఆకలికేకలు మొదలయ్యాయి. మూడు టీములకు పోటీపెట్టగా రెండు టీమ్స్ గెలిచి రేషన్ పొందింది. కానీ ఒక్క టీమ్ మాత్రం మంచి తిండి దొరక్క అల్లాడిపోయింది. ఓడిపోయేవారితో ఉండనంటూ నిఖిల్‌కు హ్యాండిచ్చింది సోనియా. తనను లూజర్ అని పదేపదే అనడంతో అతడు ఉండబట్టలేక ఏడ్చేశాడు. ఇంకా హౌస్‌లో ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి (సెప్టెంబర్ 11) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి..
ఇచ్చినట్లే ఇచ్చి లాక్కున్న బిగ్‌బాస్
వారానికి సరిపడా ఆహారాన్ని బిగ్‌బాస్(#BiggBoss8Telugu) సూపర్ మార్కెట్ నుంచి తీసుకోమని చీఫ్స్‌ను ఆదేశించాడు బిగ్‌బాస్. అలా చీఫ్స్ యష్మి, నైనిక, నిఖిల్ తమకు ఇచ్చిన గడువులో వీలైనంత ఆహారాన్ని తమ ట్రాలీలలో వేసుకున్నారు. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఇచ్చాడు. ఈ మూడు టీమ్స్ సంపాదించిన రేషన్‌ను వాడుకోవాలంటే తాను ఇచ్చే టాస్కులు గెలవాలని మెలిక పెట్టాడు. మొదటగా మూడు టీమ్స్‌కు లెమన్ పిజ్జా టాస్క్ ఇచ్చాడు. ఇందులో యష్మి టీమ్ గెలిచింది.
సోనియా ఏడుపు.. హగ్గులతో ఓదార్పు
ఇక వేరే టీమ్స్‌కు ఫుడ్ దొరకదనుకుందో, ఏమో కానీ ఆహారం అనేది అందరూ షేర్ చేసుకోవాలంటూ సోనియా ఏడ్చేసింది. దీంతో అభయ్, నిఖిల్, పృథ్వీ వరుసగా ఆమెకు హగ్గులిచ్చి ఓదార్చారు. తర్వాత నిఖిల్, నైనిక టీమ్స్‌కు బిగ్‌బాస్ పోటీపెట్టాడు. తాను అడిగే వస్తువులను తీసుకురావాలని ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో ఆడేందుకు నిఖిల్ రెడీ అవగా అందుకు మణికంఠ ఒప్పుకోలేదు. తాను నామినేషన్‌లో ఉన్నానని, తానే ఆడతానని మంకుపట్టు పట్టాడు.
ఆ ఒక్క నిర్ణయంతో కెరటం ఓటమి
అలా నిఖిల్ టీమ్ నుంచి మణి, నైనిక టీమ్ నుంచి సీత బరిలోకి దిగారు. పప్పులు, పిండి, నెయ్యి, యాపిల్.. ఇలా ఒక్కో వస్తువు చెప్పినకొద్దీ ఎవరు ముందు తీసుకొస్తే వారు ఆ రౌండ్‌లో గెలిచినట్లు! మరమరాలు పావుకిలో తెమ్మన్నప్పుడు మణికంఠ దానికి దగ్గర్లో (290 గ్రాములు) పట్టుకొచ్చాడు. అయితే సరిగ్గా 250 గ్రాములు ఉంటే మాత్రమే అంగీకరిస్తానని, ఈ రౌండ్‌లో ఎవరూ విజేతలు కాదని ప్రకటించింది యష్మి. సంచాలకురాలిగా తన నిర్ణయమే ఫైనల్ అని వెల్లడించింది.
వారమంతా రాగి ముద్దతోనే..
ఫైనల్‌గా ఈ ఛాలెంజ్‌లో సీత తన అంతులేని వీరులు టీమ్‌ను గెలిపించింది. కెరటం టీమ్‌లోని నిఖిల్, మణికంఠకు రేషన్ లేదని బిగ్‌బాస్ తెలియజేయడంతో సీత ఏడ్చేసింది. రేషన్‌కు బదులుగా వారమంతా రాగిపిండితోనే సర్దిపెట్టుకోమన్నాడు. దీంతో యష్మి కూడా కంటతడి పెట్టుకుంది. ఇక రాత్రి యష్మి.. టీమ్ అన్నాక అందరూ ఒకే దగ్గర పడుకోవాలని ఆదేశించింది.
దొంగతనం షురూ
అందుకు సోనియా సరేనంటూ తలూపుతూనే నిఖిల్ దగ్గరకొచ్చి దానిపై అభ్యంతరం తెలిపింది. ఉదయాన్నేమో.. అందరూ దోసె చేద్దామనుకుంటే కుదరదు ఎగ్ రైసే చేయాలని యష్మి ఆదేశించింది. ఇంత కఠినంగా ఉండటం దేనికని తన టీమ్ సభ్యులే గుసగుసలాడారు. అప్పటిదాకా ఫుడ్ అందరికీ రాలేదని బాధపడిపోయిన ఇంటిసభ్యులు కాస్త ఫుడ్ కడుపులో పడగానే దొంగతనం మొదలుపెట్టేశారు. అటు బిగ్‌బాస్ పంపిన కూరగాయలు ఉడికించుకుని తిని నిఖిల్, మణి కడుపు నింపుకున్నారు.
ఎమోషనల్ ఫూల్
మరోవైపు నిఖిల్ నామినేషన్స్‌లో జరిగిన తంతు నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నాడు. ఒంటరిగా కూర్చుని తనలో తానే బాధపడుతున్నాడు. అది చూసిన నైనిక.. నువ్వొక ఎమోషనల్ ఫూల్ అనేసింది. హౌస్‌లో ఏం చేసినా ప్రాబ్లమేనంటూ ఏడ్చేశాడు. నిజానికి ఆ ఏడుపు సోనియా అన్న మాటల వల్లేనని మనకు తర్వాత తెలుస్తుంది. అభయ్‌తో సోనియా.. నిఖిల్‌గాడిని చూస్తేనే కోపమొస్తుందని చెప్పింది.
లూజర్స్‌తో ఉండనన్న సోనియా
అందుకు అభయ్.. నువ్వు నిఖిల్‌ను పదేపదే లూజర్ అన్నావంటగా.. లూజర్స్‌తో ఉండను అన్నావంట.. అలా అన్నప్పుడు తనతో ఇంకెలా మాట్లాడతానని నిఖిల్ ఫీలయ్యాడని ఆ సమాచారం సోనియాకు చేరవేశాడు. అందుకు సోనియా.. మరీ అంత కాకపోయినా, క్యాజువల్‌గా మాట్లాడితే అయిపోతుందిగా అని లైట్ తీసుకుంది. ఇక హౌస్‌లో అవతలివారిని రెచ్చగొట్టేది ప్రేరణ, విష్ణుప్రియ వీళ్లిద్దరు మాత్రమేనంది. అయినా మొన్నటి నామినేషన్స్‌తో రెచ్చగొట్టడంలో ఎవరు తోపు? అనేది జనాలకు ఈజీగా అర్థమైపోయిందిలే!
Comments
Please login to add a commentAdd a comment