వైవిధ్య పాత్రలను పోషిస్తూ అటు కోలీవుడ్‌లో, ఇటు టాలీవుడ్‌లోనూ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ ఆంటోనీ. తాజాగా ఈ టాలెంటెడ్ హీరో నటించిన చిత్రం ‘లవ్ గురు’. ఆయన నటించిన తొలి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. మంచి అంచనాల మధ్య నేడు (ఏప్రిల్ 11) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
‘లవ్ గురు’ కథేంటంటే..
ఆర్థిక సమస్యల కారణంగా మలేసియా వెళ్లిన అరవింద్(విజయ్ ఆంటోని) కొన్నాళ్ల తర్వాత తిరిగి ఇండియాకు వస్తాడు. అప్పటికే ఆయనకు 35 ఏళ్ల వయసు వచ్చేస్తుంది. డబ్బు సంపాదనలో పడి వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించడు. ఇప్పటికైనా ఒంటరి జీవితానికి స్వస్తి చెప్పాలని సొంతూరు సింహాచలం వెళ్తాడు. తన మనసుకు నచ్చిన అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అలా ఓసారి చావు ఇంట్లో తన బంధువుల అమ్మాయి లీల(మృణాళిని రవి) చూసి, తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న అరవింద్ తల్లిదండ్రులు.. లీల తండ్రితో మాట్లాడి పెళ్లికి ఒప్పిస్తారు. లీలకు మాత్రం ఈ పెళ్లి ఇష్టం ఉండదు. హీరోయిన్ కావాలనేది ఆమె డ్రీమ్. కానీ ఆమె తండ్రికి కూతురు నటిగా మారడం ఇష్టం ఉండదు. బలవంతంగా అరవింద్‌తో పెళ్లికి ఒప్పిస్తాడు.
పెళ్లైన మరుసటి రోజు అరవింద్‌కు ఈ విషయం తెలుస్తుంది. హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిన తర్వాత అరవింద్‌ను దూరం పెడుతుంది లీల. విడాకులు తీసుకుందామని చెబుతుంది. లీల డ్రీమ్ గురించి తెలిసిన తర్వాత ఆమెపై మరింత ప్రేమను పెంచుకుంటాడు అరవింద్. ఆమెకు దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైన సమస్యలు ఏంటి? భార్య ప్రేమను పొందడానికి అరవింద్ ఏం చేశాడు? అతన్ని వెంటాడుతున్న గతమేంటి? లీలా జీవితంలోకి వచ్చిన విక్రమ్ ఎవరు? జనని ఎవరు? ఆమెకు అరవింద్‌కు ఉన్న సంబంధం ఏంటి? నిప్పు అంటే అరవింద్‌కు ఎందుకు భయం? హీరోయిన్ కావాలనే లీల కల నెరవేరిందా లేదా? చివరకు వీరిద్దరు విడిపోయారా? లేదా దగ్గరయ్యారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
విజయ్ ఆంటోని సినిమాల్లో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు ఓ మంచి సందేశం ఉంటుంది. ‘లవ్ గురు’ కూడా అదే తరహా కథ. ఓ మహిళ కలకు పెళ్లి అడ్డం కాకూడదని, మనల్ని ప్రేమించకున్నా మనం ప్రేమించడమే అసలైన ప్రేమ అనే ఓ సందేశాన్ని ఈ సినిమా ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కథగా చూస్తే ఇది ఇందులో కొత్తదనమేమి ఉండడు. హీరోతో పెళ్లి హీరోయిన్‌కి ఇష్టం ఉండడు. పెద్దల బలవంతంతో పెళ్లి చేసుకుంటారు. ఆమె ప్రేమను పొందడానికి హీరో రకరకాల ప్రయత్నం చేస్తాడు. చివరకు ఒక్కటవుతారు.. ఈ తరహా కథతో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. కానీ వినోదాత్మకంగా కథనాన్ని సాగించడం లవ్‌గురు ప్రత్యేకత.
కేలవం భార్యభర్తల రిలేషన్‌ని మాత్రమే కాకుండా సిస్టర్ సెంటిమెంట్‌ని కూడా జోడించడం ఈ సినిమాకు కొత్తదనం తెచ్చిపెట్టింది. హీరోహీరోయిన్ల పాత్రలతో చాలా మంది కనెక్ట్ అవుతారు. జీవిత భాగస్వామిని ఎలా ప్రేమించాలి అనేది ఈ సినిమాలో చూపించారు.
అరవింద్‌ని ఓ పీడకల వెంటాడే సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. మలేసియా నుంచి ఇండియాకు తిరిగి రావడం.. చావు ఇంటిలో లీలను చూసి ఇష్టపడడం.. పెళ్లి చేసుకొని హైదరాబాద్‌కు మకాం మార్చడం వరకు కథనం సింపుల్‌గా సాగుతుంది. హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత లీల స్నేహితులు చేసే హంగామ నవ్వులు పూయిస్తాయి.
అలాగే విజయ్ ఆంటోనికి.. వీటీవీ గణేష్ మధ్య జరిగే సంభాషణ కూడా వినోదాన్ని పంచతుంది. యోగిబాబు ఎంట్రీతో కథ మలుపు తిరుగుతుంది. భార్య ప్రేమను గెలుచుకోవడం కోసం హీరో చేసే పని షారుక్ ‘రబ్ నే బనా ది జోడి’ని గుర్తు చేస్తుంది. ఇంటర్వెల్ సీన్ ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్ ఎమోషనల్‌గా సాగుతుంది. సినిమా అంటూ లీల ప్రెండ్స్ చేసే హంగామా బోర్ కొట్టిస్తుంది. అరవింద్ ప్లాష్‌బ్యాక్ స్టోరీ భావోద్వేగానికి గురి చేస్తుంది. క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. ఎలాంటి అశ్లీలత లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసే కామెడీ ఎంటర్‌టైనర్ ఇది.
ఎవరెలా చేశారంటే..
అరవింద్‌గా విజయ్ ఆంటోనీ తన పాత్రలో ఒదిగిపోయారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో తనదైన హావాభావాలతో మెప్పించారు. లీల పాత్రలో మృణాళిని రవి మెప్పించింది. తన అందంతో తెరపై ఆకట్టుకుంది. మిగిలిన వారు తమ పాత్రల పరిధి మేర న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఫర్వాలేదు. నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment