కొందరు దక్షిణాది హీరోలు చలో ముంబై అన్నారు. ఎందుకంటే ఈ హీరోలు కనిపించే చిత్రాల్లో ‘ముంబై’ బ్యాక్‌డ్రాప్ ఉంది. కేరాఫ్ ముంబై అంటూ సాగే చిత్రాల్లో కొన్నింటి గురించి తెలుసుకుందాం.
డాన్ మొయిద్దీన్ భాయ్ రజనీకాంత్
ముంబై కాంబినేషన్ అంటే ‘బాషా’, ‘కాలా’ వంటి సినిమాలు గుర్తుకు వస్తాయి. ఈ జాబితాలో తాజాగా ‘లాల్ సలామ్’ సినిమా చేరింది. కానీ ఈ చిత్రంలో రజనీకాంత్ హీరో కాదు. ఓ లీడ్ క్యారెక్టర్. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ లీడ్ రోల్స్ చేయగా,రజనీకాంత్, కపిల్ దేవ్, జీవితా రాజశేఖర్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో ముంబై డాన్ మొయిద్దీన్ భాయ్ పాత్రలో కనిపిస్తారు రజనీకాంత్. రెండు వర్గాలకు చెందిన క్రికెటర్ల మధ్య గొడవలను మొయిద్దీన్ ఎలా తీర్చాడు? అనేది చిత్రం ప్రధానాంశం. ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వంలో లైకా ప్రోడక్షన్స్ సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది.
డబుల్ ఇస్మార్ట్
ముంబైకి షిఫ్ట్ అయ్యాడట ఇస్మార్ట్ శంకర్. హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందిన హిట్ ఫిల్మ్ ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ప్రస్తుతం ‘డబుల్ ఇస్మార్ట్’ చేస్తున్నారు రామ్, పూరి జగన్నాథ్. ఈ చిత్రంలో సంజయ్ దత్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం మేజర్‌గా ముంబై నేపథ్యంలో సాగుతుందని ఫిల్మ్ నగర్ సమాచారం. ఓ కీలక షెడ్యూల్ చిత్రీకరణ కూడా ముంబైలో జరిగింది. పూరి జగన్నాథ్, ఛార్మీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను మార్చి 18న విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం విడుదల వాయిదా పడినట్లుగా తెలుస్తోంది.
ధారావి?
‘గోదావరి’, ‘హ్యాపీ డేస్’, ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’, ‘ఫిదా’ ‘లవ్‌స్టోరీ’ వంటి సెన్సిబుల్ సినిమాలు తీసిన దర్శకుడు శేఖర్ కమ్ముల సడన్‌గా ట్రాక్ మార్చారు. ముంబై మాఫియా నేపథ్యంలో ‘డీఎన్‌ఎస్’ (వర్కింగ్ టైటిల్) సినిమాను తీస్తున్నారట. ధనుష్, నాగార్జున హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ ఫిల్మ్ ఇది. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్. ఇక ‘డీఎన్‌ఎస్’ కథ రీత్యా నాగార్జున ఓ పెద్ద డాన్ పాత్రలో కనిపిస్తారని, ఓ సాధారణ యువకుడి స్థాయి నుంచి మాఫియా గ్రూప్ లీడర్‌గా ఎదిగే పాత్రలో ధనుష్ కనిపిస్తారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
అలాగే ఈ సినిమాకు ‘ధారావి’ అనే టైటిల్ పరిశీలించారనే ప్రచారం కూడా జరిగింది. ముంబైలో మురికి వాడప్రాంతం అయిన ‘ధారావి’ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందట. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ తిరుపతిలో మొదలై, పూర్తయింది. నెక్ట్స్ షెడ్యూల్‌ను గోవాలో ప్లాన్ చేశారని తెలిసింది. ‘లవ్‌స్టోరీ’ చిత్రం తర్వాత దర్శకుడు శేఖర్ కమ్ములతో సునీల్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ముంబైలో క్యాషియర్
బొంబాయిలో ‘లక్కీ భాస్కర్’గా మారిపోయారు దుల్కర్ సల్మాన్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘లక్కీ భాస్కర్’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్. 1980 కాలంనాటి బొంబాయి నేపథ్యంలో ఈ చిత్రం కథాంశం ఉంటుంది. ఇందులో మగధ బ్యాంకులో క్యాషియర్‌గా పని చేసే భాస్కర్ పాత్రలో కనిపిస్తారు దుల్కర్ సల్మాన్. ఇటీవలే ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజయ్యే చాన్స్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment