
ప్రముఖ రచయిత, నటుడు పరుచూరి వెంకటేశ్వరరావు వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే కదా! వయోభారంతో కృంగిపోతున్న ఆయనకు ఏదో వ్యాధి సోకిందని, అందుకే ఇలా బక్కచిక్కిపోయాడంటూ ఏవేవో కథనాలు కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో పరుచూరి వెంకటేశ్వరరావుకు ఏమైందో తెలియజేస్తూ ఇటీవల ఓ వీడియో రిలీజ్ చేశాడు ఆయన బ్రదర్ పరుచూరి గోపాలకృష్ణ.
'అన్నయ్య బాగానే ఉన్నాడు. కాకపోతే 2017లో ఆస్ట్రేలియా వెళ్లి వచ్చినప్పుడు కొంత తేడా వచ్చింది. పరీక్షలు చేయించుకుంటే కొన్ని ఆహార నియమాలు పాటించమని చెప్పారు. ఆ తర్వాత ఆయన 10 కిలోలు తగ్గారు. ఈ రెండు సంవత్సరాలలో నేనూ 10 కిలోల బరువు తగ్గాను. కానీ ఆయన మేధస్సు అలాగే ఉంది. జుట్టుకు రంగు వేయకపోయేసరికి అలా ఉన్నాడు. ఆ ఫొటో షేర్ చేసిన జయంత్‌ను కూడా అడిగాను. ఎందుకయ్యా అలాంటి ఫొటో పెట్టావు, ఆయన ఎలా ఉన్నాడో మన కంటితో చూడొచ్చుగా అన్నాను. చిక్కిపోయాడు, జుట్టుకు రంగేసుకోలేదని ఇలా చాలామంది అన్నారు. ఒక్క వ్యక్తి మాత్రం 80 ఏళ్లు వచ్చాక ఇంకెలా ఉంటాడు? ఎందుకిలా మాట్లాడుతున్నారు? అని కరెక్ట్‌గా చెప్పాడు. వయసు మీదపడే కొద్దీ శరీర ధర్మాలు మారుతూ ఉంటాయి. అన్నయ్య క్షేమంగానే ఉన్నాడు' అని గోపాల కృష్ణ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment