హీరోలు దాదాపు ఒకే భాషకు పరిమితం అవుతారు. అయితే హీరోయిన్లు పలు భాషల్లో నటిస్తుంటారు. అందుకే కొందరు కథానాయికలు కొత్త సినిమాలకు డేట్స్ ఇవ్వడానికి డైరీని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని అవకాశాలు వస్తాయి. మరి.. ఈ ఏడాది క్యాలెండర్‌లో ఏ హీరోయిన్ డైరీలో ఎన్ని చిత్రాలున్నాయో తెలుసుకుందాం.
అనుష్క: అనుష్క లీడ్ రోల్‌లో రూపొందిన ‘నిశ్శబ్దం’ సినిమా 2020 అక్టోబర్ 2న రిలీజైంది. ఆ తర్వాత రెండేళ్లు ఆమె తెరపై కనిపించలేదు. దాంతో అనుష్క నెక్ట్స్ ప్రాజెక్ట్
ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో యువ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న సినిమాలో నటించేందుకు పచ్చజెండా ఊపి, అందర్నీ ఆశ్చర్యపరిచారు అనుష్క. పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రంతో బిజీగా ఉన్నారు అనుష్క.
త్రిష: ప్రస్తుతం త్రిష చేతిలో నాలుగు సినిమాలున్నాయి. వాటిలో ‘సదురంగ వేట్టె 2, పొన్నియిన్ సెల్వన్ 2, ది రోడ్’ వంటి తమిళ చిత్రాలతో పాటు మోహన్‌లాల్ హీరోగా నటిస్తున్న మలయాళ చిత్రం ‘రామ్’ ఉన్నాయి. ఇక 2016లో విడుదలైన ‘నాయకి’ తర్వాత త్రిష తెలుగులో నేరుగా ఏ సినిమాలోనూ నటించలేదు.
తమన్నా: ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లు అవుతున్నా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు మిల్కీ బ్యూటీ తమన్నా. ప్రస్తుతం చిరంజీవికి జోడీగా ‘బోళా
శంకర్’, తమిళ్‌లో రజనీకాంత్ సరసన ‘జైలర్’, మలయాళంలో ‘బాంద్రా’ అనే సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆమె నటించిన తాజా హిందీ చిత్రం ‘బోలే చూడియా’ విడుదలకు సిద్ధంగా ఉంది.
కాజల్ అగర్వాల్: ఈ ఏడాది నాలుగు సినిమాలతో అలరించనున్నారు కాజల్. ఆమె నటించిన తమిళ చిత్రాలు ‘కురుంగాప్పియమ్, ఘోస్టీ’ విడుదలకు సిద్ధమవుతున్నాయి. హిందీలో చేసిన ‘ఉమ’ కూడా విడుదల కావాల్సి ఉంది. ఇక కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఇండియన్ 2’ (భారతీయుడు 2) చిత్రంలో నటిస్తున్నారు.
నయనతార: గత ఏడాది తెలుగులో ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో నటించిన నయనతార ఈ ఏడాది తెలుగు సినిమాలేవీ కమిట్ కాలేదు. హిందీ చిత్రం ‘జవాన్’లో షారుక్ ఖాన్ సరసన నటిస్తున్నారామె. బాలీవుడ్‌లో నయనకి ఇది తొలి చిత్రం. తమిళంలో ‘ఇరైవన్’ చిత్రంలో నటిస్తున్నారు.
శ్రుతీహాసన్: ఈ ఏడాది సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాల్లో అలరించారు శ్రుతీహాసన్. ప్రస్తుతం ఆమె ప్రభాస్‌కి జోడీగా ‘సలార్’లో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదలకానుంది. మరోవైపు ‘ది ఐ’ అనే ఇంగ్లిష్ ప్రాజెక్ట్‌లోనూ నటిస్తున్నారు శ్రుతీహాసన్.
కీర్తీ సురేశ్: ప్రస్తుతం అరడజనుకుపైగా సినిమాల్లో నటిస్తున్నారు. కీర్తీ సురేశ్. తెలుగులో చిరంజీవి హీరోగా రూపొందుతోన్న ‘బోళా శంకర్’లో చిరంజీవి చెల్లెలి పాత్ర చేస్తున్నారు కీర్తి. నాని హీరోగా తెరకెక్కుతోన్న ‘దసరా’లో హీరోయిన్‌గా నటిస్తున్నారు. తమిళ్‌లో ‘మామన్నన్, సైరన్, రఘు తాతా, రివాల్వర్ రీటా’ వంటి చిత్రాలతో జోరుగా ఉన్నారు కీర్తీ సురేశ్.
పూజా హెగ్డే: గత ఏడాది ఐదు సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించిన పూజా హెగ్డే ప్రస్తుతం ఒక తెలుగు, మరో హిందీ సినిమా చేస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో మహేశ్‌బాబుకి జోడీగా నటిస్తున్నారామె. అలాగే ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ అనే హిందీ చిత్రం చేస్తున్నారు.
రష్మికా మందన్న: కన్నడ బ్యూటీ రష్మికా మందన్నా ఈ సంక్రాంతికి ‘వారీసు’ (‘వారసుడు) తో తెరపైకి వచ్చారు. అలాగే హిందీలో నటించిన ‘మిషన్ మజ్ను’ శుక్రవారం రిలీజైంది. ప్రస్తుతం ఆమె తెలుగులో అల్లు అర్జున్ సరసన ‘పుష్ప 2’లో నటిస్తున్నారు. అలాగే రణ్‌బీర్ కపూర్ సరసన హిందీ చిత్రం ‘యానిమల్’లో హీరోయిన్‌గా నటిస్తున్నారు.
కృతీ శెట్టి: గత ఏడాది ‘బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు కృతి. ప్రస్తుతం ఆమె నటిస్తున్న తెలుగు చిత్రం ‘కస్టడీ’. ‘బంగార్రాజు’ తర్వాత నాగచైతన్య సరసన ఆమె నటిస్తున్న చిత్రం ఇది. అలాగే ‘అజయింటే రందం మోషణం’ అనే మలయాళ చిత్రంలోనూ నటిస్తున్నారు.
శ్రీలీల: దక్షిణాదిలో దూసుకెళుతున్న యంగ్ హీరోయిన్ల జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉన్నారు శ్రీలీల. ‘పెళ్లిసందడి’ సినిమాతో తెలుగుకి పరిచయమైన ఈ బ్యూటీ గత ఏడాది ‘ధమాకా’లో కనిపించారు. ప్రస్తుతం మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంతో పాటు బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మూవీలో నటిస్తున్నారు. అలాగే రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న సినిమాతో పాటు ‘అనగనగా ఒకరాజు, జూనియర్ (తెలుగు–కన్నడ) వంటి సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారీ బ్యూటీ.
అదేవిధంగా బాలీవుడ్ బ్యూటీలు దీపికా పదుకోన్, కియారా అద్వానీ, కృతీ సనన్ అటు తెలుగు, ఇటు హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’తో దీపికా పదుకోన్
తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు. బాలీవుడ్‌లో ఆమె నటించిన ‘పఠాన్’ ఈ నెల 25న రిలీజ్ కానుండగా, ‘ఫైటర్’ అనే సినిమాలో నటిస్తున్నారు దీపిక. ఇక రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘వినయ విధేయ రామ’ తర్వాత చరణ్–కియారా జంటగా నటిస్తున్న చిత్రమిది. అలాగే ‘సత్యప్రేమ్ కీ కథ’ అనే హిందీ చిత్రం చేస్తున్నారు కియారా. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ తెరకెక్కించిన ‘ఆది పురుష్’లో హీరోయిన్‌గా నటించారు కృతీ సనన్. జూన్ 16న ఈ సినిమా విడుదల కానుంది. హిందీలో ‘షెహజాదా, గణపత్’తో పాటు మరో సినిమా చేస్తున్నారు కృతీ సనన్.
సమంత లీడ్ రోల్ చేసిన ‘యశోద’ గత ఏడాది రిలీజైన విషయం తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో ఆమె లీడ్ రోల్ చేసిన ‘శాకుంతలం’ ఫిబ్రవరి 17న విడుదల కానుంది. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ‘ఖుషి’లో విజయ్ దేవరకొండకి జోడీగా నటిస్తున్నారు సమంత. మరోవైపు ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ కమిట్ అయ్యారు. అయితే మయోసైటిస్ వ్యాధి చికిత్సలో భాగంగా ఆరు నెలలుగా షూటింగ్స్‌కు దూరంగా ఉంటున్నారామె. ఇప్పుడు కోలుకున్న సమంత ముంబైలో ‘సిటాడెల్’ షూట్‌లో పాల్గొంటున్నారు. సమంతకు పేరు తెచ్చిన ‘ది ఫ్యామిలీమేన్ 2’ వెబ్æసిరీస్‌కి దర్శకత్వం వహించిన రాజ్ అండ్ డీకే ఈ సిరీస్‌కి దర్శకులు.
Actresses: కథానాయికల క్యాలెండర్.. బిజీ బిజీ
Published Sun, Jan 22 2023 1:32 AM | Last Updated on Sun, Jan 22 2023 10:05 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment