స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
డీసీసీ అధ్యక్షుడు అశోక్
ములుగు: స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన ములుగులో విలేకరులతో మాట్లాడారు. పార్టీ కార్యకర్తలు.. ప్రజల మధ్యలో ఉంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించాలని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేయాలన్నారు. అధిష్టానం అనుమతి లేకుండా పార్టీ నాయకులు ఎలాంటి ప్రెస్‌మీట్‌లు పెట్టొద్దని సూచించారు. కార్యకర్తల మధ్య విభేధాలు ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకురావాలని కోరారు. సీనియర్లు, జూనియర్లు కలిసికట్టుగా పార్టీ గెలుపుకోసం కృషి చేయాలని తెలిపారు.
రామప్ప.. బ్యూటిఫుల్
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయ నిర్మాణం అద్భుతంగా ఉందని, కట్టడం బ్యూటీఫుల్‌గా ఉందని స్విట్జర్లాండ్ దేశానికి చెందిన టీనా దంపతులు కొనియాడారు. టీనా దంపతులు తమ కుమార్తెతో కలిసి రామప్ప రామలింగేశ్వరస్వామిని శనివారం దర్శించుకున్నారు. ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. రామప్ప ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప టెంపుల్ బాగుందని వారు కొనియాడారు. కాగా, టీనా భర్త స్వస్థలం హైదరాబాద్ అని తెలిపారు.
సమ్మక్క సాగర్ గేట్లు మూసివేత
కన్నాయిగూడెం: మండలంలోని తుసాకులగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో గోదావరి పై ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజీ గేట్లను అధికారులు మూసివేశారు. గత కొన్ని రోజుల నుంచి రెండు గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్న అధికారులు ఒక గేటును శనివారం మూసి ఒక గేటు ద్వారా 5,069క్యూసెక్కుల నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. బ్యారేజీలో 59 గేట్లకు 58 గేట్లను మూసి ఉంచారు. బ్యారేజీలోకి ఎగువ నుంచి 5,900క్యూసెక్కుల నీరు చేరుతుంది. ప్రస్తుతం బ్యారేజీలో 79.40 మీటర్ల నీటి మట్టం కొనసాగుతుంది. బ్యారేజీ సామర్థ్యం 6.94 టీఎంసీలకు 3.81 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఇంజనీరింగ్ అధికారులు వెల్లడించారు.
నిట్‌లో సాతి వర్క్‌షాప్
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లోని సెమినార్ హాల్ కాంప్లెక్స్‌లో శనివారం సాతి–సీస్కామ్ (సాఫిస్టికేటేడ్ అనలాటికల్ అండ్ టెక్నికల్ హెల్ప్ ఇన్‌స్టిట్యూట్), సెంటర్ ఫర్ ఇన్‌స్టిట్యూట్ అండ్ కోరిలేటివ్ మైక్రోస్కోపీ) సౌకర్యాలపై శనివారం వర్క్‌షాప్ నిర్వహించారు. ఐఐటీ హైదరాబాద్ క్లస్టర్‌కు డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సౌజన్యంతో రూ.60 కోట్ల నిధులు మంజూరయ్యాయని, ఇందులో నిట్ వరంగల్ భాగస్వామిగా ఉంటుందని సాతి – సీస్కామ్ ప్రిన్సిపాల్ ఇన్వెస్టిగేటర్ శౌర్య దత్తా తెలిపారు. నిట్ వరంగల్ విద్యార్థులు మైక్రోస్కోపీ వినియోగంపై అవగాహన కల్పించేందుకు వర్క్‌షాప్ తోడ్పడుతుందని తెలిపారు. కార్యక్రమంలో నిట్ ప్రొఫెసర్లు, సాతి–సీస్కామ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment