కలెక్టర్‌ ముద్ర లేకుండా.. సస్పెన్షన్‌ లెటర్‌? | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ ముద్ర లేకుండా.. సస్పెన్షన్‌ లెటర్‌?

Published Tue, Feb 4 2025 1:31 AM | Last Updated on Tue, Feb 4 2025 1:31 AM

కలెక్టర్‌ ముద్ర లేకుండా.. సస్పెన్షన్‌ లెటర్‌?

కలెక్టర్‌ ముద్ర లేకుండా.. సస్పెన్షన్‌ లెటర్‌?

ములుగు: జిల్లాలోని అన్ని శాఖలకు కలెక్టర్‌ బాస్‌ అనేది అందరికీ తెలిసిందే. ఆయన ఆదేశాలను ఎవరైనా పాటించాల్సిందే. అలాంటిది ములుగు జిల్లాలో కలెక్టర్‌ స్టాంప్‌ లేకుండా వెంకటాపురం(కె) అంగన్‌వాడీ ప్రాజెక్టు సీడీపీఓను సస్పెండ్‌ చేస్తూ విడుదలైన లెటర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. సంక్షేమ శాఖ చైర్మన్‌గా ఉన్న కలెక్టర్‌ నేరుగా నిర్ణయం తీసుకొని చర్యలు తీసుకునే అవకాశం ఉండగా సీడీపీఓ ధనలక్ష్మీని సస్పెండ్‌ చేస్తూ వచ్చిన ఉత్తర్వు లెటర్‌లో కేవలం కలెక్టర్‌ పేరు మాత్రమే ఉండగా కింద ఇన్‌చార్జ్‌ డీడబ్ల్యూఓ స్టాంప్‌ ఉండడం విశేషం. జిల్లా బాస్‌గా ప్రతీ విషయంపై స్పందించాల్సిన కలెక్టర్‌ ఈ విషయమై పలుమార్లు ఫోన్‌లో మాట్లాడడానికి ప్రయత్నించగా సాక్షికి అందుబాటులోకి రాలేదు. అయితే గత కొన్ని రోజులుగా కలెక్టర్‌ విలేకరుల విషయంలో స్పందించకుండా నడుచుకుంటున్నారని తెలుస్తోంది. ఇదే విషయమై సంక్షేమ శాఖ రీజినల్‌ డైరెక్టర్‌ ఝాన్సీని వివరణ కోరగా ప్రస్తుతం సెలవులో ఉన్నానని విధుల్లోకి చేరిన అనంతరం జిల్లాలో జరుగుతున్న తతంగంపై ఆరా తీసి రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తానని వెల్లడించారు. అయితే పత్రికలో వచ్చిన వార్తను చూశానని ఆకోణంలోనూ విచారణ చేపడుతానని వివరించారు.

● జిల్లాలోని సంక్షేమ శాఖలో డీడబ్ల్యూఓ, వెంకటాపురం(కె) సీడీపీఓ మధ్యలో సాగుతున్న అంతర్గత పోరు వ్యవహారంపై సోమవారం డీడబ్ల్యూఓ వర్సెస్‌ సీడీపీఓ పేరుతో సాక్షిలో కథనం వెలువడిన విషయం తెలిసిందే.. దీంతో ఈ విషయం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఇకముందు మరిన్ని కథనాలు వచ్చే అవకాశం ఉందని తెలిసిన సంబంధిత జిల్లా ఉన్నతాధికారి సస్పెషన్‌ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. పైగా ప్రస్తుత డీడబ్ల్యూఓ విషయంలో ఏకంగా మంత్రి సీతక్కను లాగడం మరో ఆసక్తికరమైన అంశం.

●డీడబ్ల్యూఓ, సీడీపీఓలకు మధ్య తలెత్తిన ఈ తగాదా అంతా వెంకటాపురం(కె) ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ సెంటర్ల నుంచి మొదలైనట్లుగా తెలుస్తోంది. వెంకటాపురం(కె) ప్రాజెక్టు పరిధిలో 2018లో ప్రస్తుత డీడబ్ల్యూఓ శిరీష సీడీపీఓగా జాయిన్‌ అయ్యారు. అప్పటి నుంచి అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బందితో సంబంధాలు బాగా పెంచుకున్నారు. తదనంతరం మూడు నెలల క్రితం ధనలక్ష్మీ సీడీపీఓగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ క్రమంలో ప్రాజెక్టు పరిధిలో కొన్ని ఆరోపణలు వచ్చాయి.

ఆరోపణలు ఇలా..

జిల్లా కాలనీ అంగన్‌వాడీ సెంటర్‌కు చర్చి తరఫున భవనాన్ని కేటాయించినా స్థానిక అంగన్‌వాడీ టీచర్‌ భర్త పేరుపై అద్దె తీసుకుంటున్నారు. శాంతినగర్‌లో సెంటర్‌ లేదు.. అంతకుముందు విధులు నిర్వహించిన అంగన్వాడీ టీచర్‌ కొడుకు పేరుమీద నెలకు రూ.1,350 తీసుకుంటున్నారు. పర్సికగూడెంలో సెంటర్‌ లేదు.. కానీ అంగన్వాడీ టీచర్‌ తమ బంధువుల పేరుపై రూ.750 రెంట్‌ తీసుకుంటున్నారు. ఎదిర–1 అంగన్‌ వాడీ సెంటర్‌ స్కూల్‌ ఆవరణలో నడుస్తోంది. కానీ అంగన్‌ వాడీ టీచర్‌ పేరుమీద రెంట్‌ వస్తోంది. రంగరాజపురంలో సెంటర్‌ పాఠశాలలో ఉంది కానీ అంగన్‌ వాడీ టీచర్‌కు సంబంధించిన బంధువు పేరుపై రెంట్‌ వస్తోంది. సాధారణంగా టీచర్‌ పోస్టు ఖాళీగా ఉంటే అర్హత ప్రకారం ఆయాకి ఆ పోస్టును కేటాయించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎస్సీ మర్రిగూడెంలోని ఆయాను బీసీ మర్రిగూడెంకు చెందిన సెంటర్‌ టీచర్‌గా నియమించారు. మర్రిగూడెంలోని ఆయాకు ఆ అవకాశం ఇవ్వలేదు. బోధాపురం–1 సెంటర్‌లో రిటైర్డ్‌ అయిన ఆయాకు ఎందుకు జీతం చేస్తున్నారని సీడీపీఓ ప్రశ్నిస్తే నీకు సంబంధం లేదని డీడబ్ల్యూఓ చెప్పినట్లు..ఇలాంటి ఆరోపణలు బహిర్గంతంగా వస్తున్నాయి. ఇలాంటి విషయంపై కలెక్టర్‌ ఏక దృష్టిలో నిర్షయం ఎలా తీసుకున్నారో అర్ధం కావడం లేదని సంక్షేమ శాఖలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై సీనియర్‌ సీడీపీఓలు, అంగన్‌ వాడీ సూపర్‌వైజర్లు నేరుగా కమిషనర్‌ను కలిసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.

సీడీపీఓను సస్పెండ్‌ చేస్తూ

విడుదలైన ఉత్తర్వులు

సోషల్‌ మీడియాలో హల్‌చల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement