6న కంటి వైద్యశిబిరం
నాగర్‌కర్నూల్‌రూరల్: జిల్లా వైద్యారోగ్యశాఖ, అంధత్వ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో నవంబర్ 6న కంటి వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు ఆప్తాలమిక్ డా. కొట్ర బాలాజీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ భవనంలో ఉదయం 9నుంచి 11 గంటల వరకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు రెఫర్ చేయనున్నట్లు పేర్కొన్నారు. శిబిరానికి వచ్చే వారు బీపీ, షుగర్ పరీక్షల రిపోర్టులతో పాటు ఆధార్ లేదా ఓటరు గుర్తింపు కార్డు జిరాక్స్‌తో రావాలని కోరారు.
అర్హులందరికీ ఇళ్లు
మంజూరు చేయాలి
తెలకపల్లి: అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్దం పర్వతాలు అన్నారు. బుధవారం తెలకపల్లిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో రాజకీయ జోక్యం లేకుండా చూడాలన్నారు. సొంతిల్లు లేని ప్రతి పేదవాడికి ఇంటి నిర్మాణం చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు. రైతులందరికీ రూ. 2లక్షల రుణమాఫీ పథకం వర్తింపజేయాలని.. వానాకాలం, యాసంగి సీజన్‌లకు సంబంధించి రైతుభరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వరి సన్నరకాలకు ఇస్తామన్న రూ. 500 బోనస్‌ను ఇప్పటి వరకు అమలు చేయలేదని మండిపడ్డారు. సీసీఐ కేంద్రాలను ఏర్పాటుచేసి మద్దతు ధరకు పత్తి సేకరణ చేపట్టాలన్నారు. సమావేశంలో ఆర్.శ్రీనివాసులు, నందిపేట భాస్కర్, విజయ్‌గౌడ్, కాశన్న ఉన్నారు.
జిల్లాస్థాయి
ఖోఖో జట్ల ఎంపిక
వెల్దండ: మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ఆవరణలో బుధవారం 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి బాలబాలికల ఖోఖో జట్లను ఎంపిక చేశారు. కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట, నాగర్‌కర్నూల్ డివిజన్ స్థాయిలో జరిగిన ఖోఖో పోటీల్లో ప్రతిభ కనబర్చిన 150 మంది క్రీడాకారులతో 8 జట్లను ఏర్పాటు చేశారు. పోటీల్లో సత్తా చాటిన జట్లకు నిర్వాహకులు బహుమతులను ప్రదానం చేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంఈఓ చంద్రుడు, ప్రిన్సిపాల్ శ్రీధర్, వ్యాయామ ఉపాధ్యాయులు పాండు, యాదయ్య, మణి, రవీందర్, మోహన్, పురణ్ తదితరులు పాల్గొన్నారు.
కొల్లాపూర్
ఆర్డీఓగా భన్సీలాల్
కొల్లాపూర్: కొల్లాపూర్ ఆర్డీఓగా భన్సీలాల్ నియమితులయ్యారు. బుధవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. గజ్వేల్ నుంచి ఆయన కొల్లాపూర్‌కు బదిలీపై వచ్చారు. ఇటీవల ఆర్డీఓ నాగరాజు సస్పెండ్ కావడంతో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు భూసేకరణ కలెక్టర్ యాదగిరికి అదనపు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించిన భన్సీలాల్‌ను రెవెన్యూ అధికారులు సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
641.411 మి.యూ. విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులోని దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతోంది. బుధవారం 9 యూనిట్ల నుంచి ఉత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ సూరిబాబు తెలిపారు. ఎగువ 4 యూనిట్ల నుంచి 156 మెగావాట్లు, 328.224 మి.యూ., దిగువ 5 యూనిట్ల నుంచి 200 మెగావాట్లు, 313.187 మి.యూ. ఉత్పత్తి సాధించామన్నారు. రెండు కేంద్రాల్లో ఇప్పటి వరకు 641.411 మి.యూ. విద్యుదుత్పత్తి చేపట్టామని.. ఇందుకుగాను 18,466 క్యూసెక్కుల నీటిని వినియోగించినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment