నిబంధనల మేరకు వరిధాన్యం కేటాయింపు
నాగర్‌కర్నూల్: రైస్‌మిల్లర్లు వానాకాలం వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలంటే.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఖచ్చితంగా బ్యాంకు గ్యారంటీ, సెక్యూరిటీ డిపాజిట్‌ను పౌరసరఫరాల కార్పొరేషన్‌కు సమర్పించాల్సి ఉంటుందని అదనపు కలెక్టర్ కె.సీతారామారావు అన్నారు. వరిధాన్యం కొనుగోలుకు సంబంధించి నూతన విధివిధానాలపై బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మిల్లర్లకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఎంఎస్ నంబర్ 27 ద్వారా తీసుకువచ్చిన నూతన విధివిధానాల మేరకు మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. అందులో భాగంగా ప్రభుత్వం మిల్లర్లను నాలుగు రకాలుగా విభజించినట్లు తెలిపారు. గతంలో ఎలాంటి బకాయి లేని మిల్లర్లు 10 శాతం బ్యాంకు గ్యారంటీ లేదా 25 శాతం సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుందన్నారు. గత బకాయిలతో పాటు పెనాల్టీ ఉన్న మిల్లర్లు 20 శాతం బ్యాంకు గ్యారంటీ లేదా 25 శాతం సెక్యూరిటీ డిపాజిట్ అందించాలన్నారు. మూడవ రకం మిల్లర్లు 100 శాతం బకాయిలు చెల్లించాలని.. 25 శాతం పెనాల్టీ పెండింగ్ ఉన్న వారు 25 శాతం పెనాల్టీ, 25 శాతం బ్యాంకు గ్యారంటీ, సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుందన్నారు. నాలుగో రకం మిల్లర్లను డిఫాల్టర్లుగా గుర్తించి, ధాన్యం కేటాయింపులు చేయడం లేదని అదనపు కలెక్టర్ తెలియజేశారు. కాగా, రైస్‌మిల్లర్ల అసోసియేషన్ అభ్యర్థన మేరకు మిల్లర్లకు అదనపు మిల్లింగ్ చార్జీలు కూడా అందజేయనున్నట్లు తెలిపారు. రైస్‌మిల్లర్లు తప్పనిసరిగా సన్న రకం, దొడ్డు రకం ధాన్యాన్ని దిగుమతులు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఇప్పటికే 127 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు చెప్పారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించినట్లు వివరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. సీఎంఆర్ గడువు నేటితో ముగిసిందని.. పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్‌ను వెంటనే అందజేయాలని మిల్లర్లకు సూచించారు. సమావేశంలో సివిల్ సప్లై డీఎం రాజేందర్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment