ఆగని అవినీతి..!
ఏసీబీకి చిక్కుతున్నా మారని తీరు
● ప్రభుత్వ శాఖల్లో పెచ్చుమీరిన అక్రమాలు
● దాడుల్లో దొరుకుతున్నా..
కొనసాగుతున్న వసూళ్ల పర్వం
● తాజాగా ఏసీబీకి దొరికిన
మహబూబ్‌నగర్ డీఈఓ
● ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన 14 మంది అధికారులు
● నిబంధనలకు తూట్లు పొడిచి,
ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైనం
14 కేసులు.. రెండు ఆకస్మిక తనిఖీలు
గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి జిల్లాలో వరుసగా అవినీతి కేసులు నమోదు కావడం ప్రభుత్వ శాఖల్లో కలకలం రేపుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 14 కేసులు నమోదు కాగా.. 21 మందిని కోర్టులో హాజరుపరిచారు. ఆర్టీఏ, బీసీ వెల్ఫేర్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అయితే ఇప్పటి వరకు నమోదైన కేసులను పరిశీలిస్తే.. అధికంగా రెవెన్యూ శాఖ ఉద్యోగులు పట్టుబడ్డారు. ఇక రాష్ట్రంలోనే ఉమ్మడి పాలమూరు అవినీతి కేసుల్లో అగ్రస్థానంలో ఉంది.
అక్రమార్కులపై నిఘా..
ముఖ్యమైన ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహించే అధికారులు, ఉద్యోగులపై ఏసీబీ నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల పనితీరును ఉన్నతాధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అయినప్పటికీ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించినా.. నిర్వహించకపోయినా పట్టించుకునే వారు ఎవరూ లేరనే ధీమా పలువురు అధికారుల్లో పెరిగిపోయినట్లు తెలుస్తోంది. రెవెన్యూ, విద్యుత్, పోలీసు, మున్సిపాలిటీ, రిజిస్ట్రేషన్, కమర్షియల్ ట్యాక్స్, చెక్‌పోస్టులు, రవాణా, లాండ్ అండ్ సర్వే, మండల కేంద్రాల్లోని కార్యాలయాల్లో అవినీతి పెచ్చరిల్లినట్లు ఆరోపణలున్నాయి. రవాణా, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌ల్లో పనిచేసే అధికారులు నేరుగా లంచాలు తీసుకోకుండా, ప్రైవేటు వ్యక్తులను ఏజెంట్లుగా పెట్టుకుని సాఫీగా పనులు సాగిస్తున్నారని తెలుస్తోంది.
ఆ సార్ రూటే సప‘రేటు’..
తాజాగా ఏసీబీకి పట్టుబడిన మహబూబ్‌నగర్ డీఈఓ రవీందర్ ఏ జిల్లాలో పనిచేసినా.. ఆయన రూటే సప‘రేటు’ అనే విధంగా వ్యవహార శైలి మార్చుకున్నాడు. జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో పనిచేసిన సమయంలో ఆయన అవినీతి వ్యవహారాలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. మూడేళ్ల క్రితం మహబూబ్‌నగర్ డీఈఓగా వచ్చారు. జిల్లాస్థాయి అధికారిగా పనిచేస్తూ రూ.లక్షలు గడించినట్లు ఆరోపణలున్నాయి. కాగా.. డీఈఓ రవీందర్ లంచం రూపంలో ఉపాధ్యాయుల నుంచి తీసుకున్న డబ్బులకు సంబంధించి కొందరు ఫోన్ పే, గూగుల్ పేకు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను ఏసీబీ అధికారులకు అప్పగించినట్లు సమాచారం. ఎవరి వద్ద ఎంత స్థాయిలో డబ్బు వసూలు చేశాడనే విషయంపై ఏసీబీ బృందం కూపీ లాగుతుంది.
మూడేళ్లుగా స్కూల్‌కు వెళ్లని డీఈఓ భార్య?
ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న డీఈఓ రవీందర్ భార్య మూడేళ్లకు పైగా విధులకు హాజరుకావడం లేదని సమాచారం. జిల్లా కేంద్రంలోని ఎర్రవల్లి తండాలో ఎస్‌జీటీగా పనిచేస్తున్న ఆమె.. మూడేళ్ల నుంచి పాఠశాలకు వెళ్లకుండా ఇంటికే రిజిస్టర్స్ తెప్పించుకుని సంతకాలు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఆమె పాఠశాలకు వెళ్లకపోవడంతో బాలానగర్ నుంచి ఇద్దరు ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై అక్కడికి తీసుకువచ్చి పెట్టారు. అయితే మళ్లీ నెలరోజుల క్రితం నిబంధనలకు విరుద్ధంగా ఆమెను డిప్యూటేషన్‌పై శ్రీనివాసకాలనీ పాఠశాలకు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. అయితే డీఈఓ భార్య లోకల్ బాడీ కింద పనిచేయాలి అంటే, గ్రామపంచాయతీ పరిధిలోని పాఠశాలలో పని చేయాలి. కానీ చేతిలో అధికారం ఉందని మున్సిపాలిటీ పరిధిలో తమ ఇంటి పక్కనున్న పాఠశాలలో పోస్టింగ్ ఇచ్చారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో అవినీతి కంపు కొడుతోంది. పైకం లేనిదే ఫైల్
ముందుకు కదలని పరిస్థితి ఉంది. ఓ వైపు లంచం
తీసుకుంటూ పట్టుబడిన వారిని ఏసీబీ అధికారులు జైలుకు పంపిస్తున్నా.. ప్రభుత్వ ఉద్యోగుల తీరులో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. పనికింత ధర అనేలా తమ జోరును చాటుమాటుగా కానిచ్చేస్తున్నారు. ఇక్కడ అక్కడ అని లేకుండా శాఖోపశాఖల్లో అవినీతి ఊడలు
విస్తరిస్తూనే ఉన్నాయి.
– మహబూబ్‌నగర్ క్రైం
విచారణ కొనసాగుతుంది..: ఏసీబీ డీఎస్పీ
లంచం తీసుకుంటూ పట్టుబడిన డీఈఓ రవీందర్ ఇంట్లో విలువైన వస్తువులేవీ పట్టుబడలేదని.. స్వగ్రామమైన దామరగిద్దలో మాత్రం ప్లాట్లు గుర్తించామని ఏసీబీ ఇన్‌చార్జి డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ తెలిపారు. బినామీ పేర్లపై ఆస్తులు ఉన్నాయనే అనుమానం ఉందని.. ఈ మేరకు డీఈఓ ఫోన్‌కాల్స్, ఇతర డాక్యుమెంట్స్ పరిశీలన చేయాల్సి ఉందన్నారు. హైదరాబాద్‌తో పాటు ఇతర బంధువులు, కుటుంబసభ్యుల ఇళ్లలో సోదాలు చేస్తున్నట్లు చెప్పారు. డీఈఓకు సంబంధించిన అన్ని రకాల ఆస్తులు ఎక్కడ ఉన్నాయనే విషయంపై సమగ్ర విచారణ కొనసాగిస్తున్నామన్నారు. గతేడాది కాలం నుంచి అతడిపై ఫిర్యాదులు వచ్చాయని.. సరైన ఆధారాల కోసం ఎదురుచూడాల్సి వచ్చిందన్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే డయల్ 1064 నంబర్‌తో పాటు ఏసీబీ అధికారులను సైతం నేరుగా కలిసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. జిల్లా ప్రజలు చాలా వరకు చైతన్యవంతం కావడంతోనే కేసుల సంఖ్య పెరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు చేస్తామని.. బాధితులను ఏ అధికారి డబ్బులు అడిగినా సమాచారం ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment