‘శవ రాజకీయాలు మానుకోవాలి’
కల్వకుర్తి టౌన్: బీఆర్‌ఎస్ నాయకులు ప్రజా క్షేత్రంలో నిజాలను తెలుసుకొని మాట్లాడాలని.. శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని నాగర్‌కర్నూల్ ఎంపీ డా.మల్లురవి అన్నారు. శుక్రవారం రాత్రి వంగూర్ మండలం కొండారెడ్డిపల్లికి చేరుకున్న ఎంపీ.. శనివారం ఉదయం స్థానిక నాయకులు, ప్రజలతో కలిసి గ్రామంలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కొండారెడ్డిపల్లికి చెందిన సాయిరెడ్డి తన వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్య చేసుకుంటే.. దాన్ని ప్రతిపక్షాలు ముఖ్యమంత్రికి అంటగట్టడం సరికాదన్నారు. కొండారెడ్డిపల్లిలో ఏది జరిగినా ముఖ్యమంత్రికి ఆపాదించడం వారి విజ్ఞతకే విడిచిపెడుతున్నామన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన సాయిరెడ్డి ఇంటికి వెళ్లేందుకు సీసీరోడ్డు ఉందని.. అతడి ఇంటికి దారి ఎక్కడ లేకుండా ఉందో చెప్పాలని అన్నారు. ముఖ్యమంత్రితో పాటు ఆయన సోదరులపై ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు ఉన్నా.. తాము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. సాయిరెడ్డి ఇంటికి వెళ్లేందుకు దారి లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరూపిస్తే, తాను రాజీనామాకు సిద్ధమన్నారు. ప్రభుత్వంపై లేనిపోని అబండాలు వేస్తే, ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. సీఎం సొంత గ్రామంలో రూ. కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబర్ కేవీఎన్ రెడ్డి, రాష్ట్ర పొల్యూషన్ బోర్డు మెంబర్ బాలాజీ సింగ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment