20 ఏళ్లుగా పెండింగ్‌లోనే..
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద కాల్వల నిర్మాణం 2005లో చేపట్టగా.. పూర్తిస్థాయి పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. ఉమ్మడి జిల్లాలోని కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, జడ్చర్ల, వనపర్తి నియోజకవర్గాల పరిధిలో సుమారు 4.50 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో ఈ ఎత్తిపోతల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. అయితే ఏళ్లుగా పూర్తిస్థాయి నిర్మాణానికి నోచుకోకపోవడంతో, సగం మేర ఆయకట్టుకే పరిమితమైంది. ప్రస్తుతం 3.07 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయి పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లు నిర్మించని కారణంగా పూర్తిస్థాయి లక్ష్యం నెరవేరడం లేదు. అలాగే విస్తరణ పనుల కింద చేపట్టాల్సిన పనులు ఇంకా మొదలుపెట్టలేదు. ఇందుకు భూసేకరణ చేపట్టాల్సి ఉండగా, ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారుతోంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 27, 28, 29, 30 ప్యాకేజీల్లో కలిపి మొత్తం 143 ఎకరాల వరకు భూసేకరణ చేపట్టాల్సి ఉంది. ఈ ప్రక్రియలో విడతల వారీగా పనులు చేపట్టారు. అయితే 20 ఏళ్లు గడుస్తున్నా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. కేఎల్‌ఐ 28వ ప్యాకేజీ కింద 84 కి.మీ., 29వ ప్యాకేజీ కింద 160 కి.మీ., 30వ ప్యాకేజీ కింద 80 కి.మీ. మేర కొత్తగా కాల్వలను తవ్వాల్సి ఉంది. తర్వాతి దశలో 30వ ప్యాకేజీ కింద కల్వకుర్తి నియోజకవర్గంలోని మాడ్గుల్ మండలం వరకు ఆయకట్టు విస్తరించేలా డిస్ట్రిబ్యూటరీ కాల్వలను నిర్మించాలని ప్రతిపాదించారు. 29వ ప్యాకేజీ కింద డీ–82 కెనాల్ విస్తరణలో సుమారు 37 ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రణాళికలు రూపొందించినా.. ఇందుకు అవసరమైన పనులు ముందుకు సాగడం లేదు. మరోవైపు డిస్ట్రిబ్యూటరీ చానళ్ల నిర్మాణం సైతం పూర్తికాకపోవడం.. ఉన్న కాల్వలకు లైనింగ్ పనులు చేపట్టకపోవడంతో ఆయకట్టు రైతులకు సరిపడా సాగునీరు అందడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment