నిబంధనల మేరకు ధాన్యం కొనుగోలు
ఉప్పునుంతల: ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ సీతారామారావు ఆదేశించారు. మండలంలోని మొల్గరలో పీఏసీఎస్ ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని త్వరగా తీసుకోవడం లేదని రైతుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు సోమవారం విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం వివరాలను తెలుసుకున్నారు. అనంతరం రైతులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. తూర్పార పట్టని ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరగా.. అడిషనల్ కలెక్టర్ తోసిపుచ్చారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నాణ్యతతో కూడిన ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. ధాన్యం సరిగ్గా లేకపోతే మిల్లర్ల వద్ద ఇబ్బందులు వస్తాయని రైతులకు వివరించారు. గతంలో మాదిరిగా తూకంలో కోతలు విధించడాన్ని సహించబోమని తెలిపారు. నాణ్యతతో కూడిన ధాన్యంలో కోతలు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఉప్పరిపల్లిలో ఉన్న బాయిల్డ్ రైస్‌మిల్లును అడిషనల్ కలెక్టర్ సందర్శించి ధాన్యం నిల్వలను పరిశీలించారు. ఆయన వెంట అచ్చంపేట ఆర్డీఓ మాధవి, తహసీల్దార్ ప్రమీల, పీఏసీఎస్ చైర్మన్ భూపాల్‌రావు, సీఈఓ రవీందర్‌రావు, అనంతరెడ్డి, నర్సింహారావు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment