12న ప్రజాభిప్రాయ సేకరణ
మిర్యాలగూడ : దామరచర్ల మండలంలోని గణేష్‌పాడు వద్ద గల పెన్నా సిమెంట్(అంబుజా) కంపెనీ గనుల విస్తరణ, సున్నపురాయి ఉత్పత్తి పెంపుపై ఈనెల 12న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నారు. 2002లో పెన్నా సిమెంట్స్‌ను నెలకొల్పగా రెండు నెలల క్రితం ఈ ప్లాంట్‌ను అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. అనధికారికంగా గనుల విస్తరణ జరిగినప్పటికీ వివిధ కారణాల వల్ల పీసీబీ ప్రజాభిప్రాయం సేకరించలేదు. దీనిపై పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేయడంతో ఈనెల 12న ప్లాంట్‌కు సమీపంలో అధికారులు సమావేశాన్ని నిర్వహించి ప్రజల అభిప్రాయాలు స్వీకరించనున్నారు. దామరచర్ల మండలంలో గణేష్‌పాడు పరిధిలో 304 హెక్టార్ల భూమిని సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యపహాడ్ పరిధిలో 50 హెక్టార్లలో మైనింగ్ లీజు ఉంది. 354 హెక్టార్ల సున్నపురాయి గనులను విస్తరించి ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏడాదికి 1.5మిలియన్ టన్నుల నుంచి 1.8 మిలియన్ టన్నులకు పెంచేందుకు అనుమతి కోసం పరిశ్రమ యాజమాన్యం దరఖాస్తు చేసుకుంది. ఈ నేపథ్యంలో పీసీబీ నిర్వహించే సమావేశానికి ప్రభావిత గ్రామాల ప్రజలు హాజరుకానున్నారు.
నిబంధనలను అతిక్రమించారని ఫిర్యాదు...
గనుల శాఖ మంజూరు చేసిన అనుమతులు జనవరి 2022లో ముగిసినప్పటికీ పరిశ్రమ యాజమాన్యం అక్రమంగా తవ్వకాలు చేశారని సామాజిక కార్యకర్తలు, పర్యావరణ వేత్తలు పదిరోజుల క్రితం జాతీయ హరిత ట్రిబ్యునల్, పీసీబీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అటవీ భూములను ఆక్రమించి, రెవెన్యూ హద్దులు చెరిపి నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ నిర్వహించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment