అప్పుల రాష్ట్రంగా మార్చింది చంద్రబాబే | Sakshi
Sakshi News home page

అప్పుల రాష్ట్రంగా మార్చింది చంద్రబాబే

Published Sun, May 5 2024 3:20 AM

అప్పుల రాష్ట్రంగా మార్చింది చంద్రబాబే

డోన్‌: రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఇటీవల డోన్‌ పర్యటనలో తనపై ఆరోపణలు చేయడంలో అర్థం లేదని, తనను అప్పుల మంత్రిగా పేర్కొనడం బాబు అవివేకానికి నిదర్శనమన్నారు. టీడీపీ హయాంలో చేసిన లక్షల కోట్ల అప్పులను చంద్రబాబు సొంత ఆస్తులు అమ్మి కట్టారా అని బుగ్గన నిలదీశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మూడుసార్లు ఎంపీగా గెలిచి కేంద్ర రైల్వే సహాయ మంత్రిగా పనిచేసిన టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డికి ఆర్థిక నేరస్తుడంటే అర్థం తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. స్వర్గీయ కోట్ల విజయభాస్కర్‌రెడ్డిపైన గౌరవంతో ఆయన గురించి స్వేచ్ఛగా మాట్లాడలేకపోతున్నానని బుగ్గన అన్నారు. తన జీవితంలో ఒక్కసారి కూడా ఇన్‌కంట్యాక్స్‌ నోటీసు అందుకోలేదని బుగ్గన చెప్పుకొచ్చారు. ఎంపీగా పనిచేసి జిల్లాకు ఏమేర నిధులు తెచ్చి అభివృద్ధి చేశావు? మూడేళ్ల నా పాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో బహిరంగ చర్చకు సిద్ధమా అని కోట్లకు బుగ్గన సవాల్‌ విసిరారు.

నియోజకవర్గాన్ని దోచుకున్నదెవరో ప్రజలకు తెలుసు

గతంలో బేతంచెర్ల మండలం గూటుపల్లె అక్రమ మైనింగ్‌ జరుగుతున్నప్పుడు జీపుపై తుపాకులు పెట్టి వచ్చి, పోయే వాహనాల వద్ద మామూళ్లు వసూలు చేసింది ఎవరో కోట్ల కుటుంబీకులు చెప్పాలన్నారు. డోన్‌లో సాక్షి నివాస్‌ వెంచర్‌ యజమానిని బెదిరించి బినామీ పేర్లపై ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేయించుకొని ఆతర్వాత ఆలూరు ఎన్నికల కోసం వాటిని విక్రయించి వచ్చిన డబ్బులను ఖర్చు చేసింది ఎవరో చెప్పాలన్నారు. డీలర్లతో కుమ్మకై ్క ప్రతి నెల రూ.30వేలు మామూలు వసూలు చేయడం, అక్రమ రేషన్‌ బియ్యం వ్యాపారులను పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పిలిపించడం, పరిచయం ఉన్న వారందరి వద్ద చేతిబదులు పేరుతో లక్షల రూపాయలు అప్పులు చేసి ఎగ్గొట్టడం ఎవరో కోట్ల కుటుంబీకులు ప్రజలకు చెప్పాలన్నారు. స్థానిక మట్కా వ్యాపారుల ఇళ్లవద్దకు వెళ్లి టీడీపీ అధికారంలోకి వస్తే మట్కా రాసుకుందురులే అని కోట్ల కుటుంబీకులు చెప్పడం వాస్తవం కాదా అన్నారు. బేతంచెర్ల మండలం ముద్దవరం గ్రామంలో తమకు ఓటేస్తే సారా వ్యాపారం చేసుకునేందుకు అనుమతులు ఇప్పిస్తామని చెప్పిందెవరో ప్రాంత ప్రజలకు తెలుసునన్నారు. టిట్కో ఇళ్ల పేరుతో టైలర్స్‌ కాలనీని నేలమట్టం చేసి లక్షలాది రూపాయలను అక్రమంగా లబ్ధిదారుల నుంచి వసూలు చేసింది ఎవరో ప్రజలకు చెప్పాలన్నారు. 2019 ఎన్నికల ముందు మార్కెట్‌లో ఒక్కొక్క వ్యాపారి నుంచి రూ.30వేలు, ఫ్లైఓవర్‌ కింద వ్యాపారులతో ఇష్టానుసారంగా మున్సిపల్‌ కమిషనర్‌ పేరుపై డీడీలు తీసి అక్రమంగా సంపాదించింది ఎవరో వివరణ ఇవ్వాలన్నారు. వైన్‌షాప్‌ల నిర్వహణలో కేఈ కుటుంబీకులతో 60, 40 శాతం కమీషన్లు తీసుకొని ప్రజల ప్రాణాలను తీసింది ఎవరో కూడా ప్రజలక సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. సమావేశంలో రాష్ట్ర మీట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ శ్రీరాములు, మున్సిపల్‌ చైర్మన్‌ సప్తశైల రాజేష్‌, పార్టీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షులు పోసు్ట్రపసాద్‌, కౌన్సిలర్లు మల్లికార్జునరెడ్డి, దినేష్‌గౌడ్‌, పార్టీ నాయకులు మల్యాల శ్రీనివాసరెడ్డి, పాలుట్ల రఘురాం, బొబ్బల శివరామిరెడ్డి పాల్గొన్నారు.

నిరాధార ఆరోపణలు

కోట్ల అజ్ఞానానికి నిదర్శనం

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

Advertisement
Advertisement