నంద్యాల(వ్యవసాయం): కార్తీక మాసం సందర్భంగా ప్రతి సోమవారం ఓంకారం, మహానంది, భోగేశ్వరం, యాగంటి, కాల్వబుగ్గ ఆలయాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజారవాణా అధికారి రజియాసుల్తానా తెలిపారు. బుధవారం ఆమె మాటాడుతూ జిల్లాలోని అన్ని డిపోల నుంచి శ్రీశైలానికి ప్రతి ఆది, సోమవారాల్లో బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా 15న అరుణాచలానికి(టికెట్ చార్జ్ రూ.1750) ప్రత్యేక బస్సును నడుపుతామన్నారు. భక్తులు బ్యాచ్‌లుగా ముందుకు వస్తే వారి కోసం సంబంధిత డిపోల నుంచి ప్రత్యేక బస్ సర్వీసును ఏర్పాటు చేస్తామన్నారు. ప్యాకేజీ టూర్ కింద ఒకే రోజులో పంచ శైవ క్షేత్రాలకు ఆది, సోమవారాల్లో బస్సు ఏర్పాటు చేస్తామన్నారు. నంద్యాల డిపో నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి మహానంది, ఓంకారం, భోగేశ్వరం, యాగంటి, కాల్వబుగ్గకును చుట్టేసి రాత్రి 9 గంటలకు తిరిగి నంద్యాలకు చేరుకుంటుందన్నారు. కోవెలకుంట్ల నుంచి కన్నేతీర్థం, నయనాలప్ప, ఓంకారం, మహానంది, యాగంటిలకు కూడా బస్సు సర్వీస్ ఏర్పాటు చేశామన్నారు. నంద్యాల డిపో నుంచి ఉదయం 6.30 గంటలకు బయలుదేరి రాత్రి 8.30 గంటలకు కోవెలకుంట్ల డిపోకు చేరుతుందన్నారు. అలాగే శబరిమలకు వెళ్లేందుకు భక్తులు బ్యాచ్‌లుగా వస్తే అద్దెప్రాతిపదికన బస్సులను ఏర్పాటు చేస్తామన్నారు.
పడిపోతున్న వేరుశనగ ధర
కర్నూలు(అగ్రికల్చర్): వేరుశనగ ధరలు పతనం అవుతుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ధరలు పడిపోవడంతో రైతులు నష్టాలు మూట కట్టుకుంటున్నారు. రబీ సీజన్‌కు సంబంధించి సబ్సిడీపై పంపిణీ చేసే వేరుశనగ క్వింటాలు ధర రూ.9,600గా నిర్ణయించింది. మార్కెట్‌లో అధిక మంది రైతులకు సగటు ధరనే లభిస్తుంది. గత నెల 22వ తేదీన సగటు ధర క్వింటం రూ. 5,891 కాగా 29న రూ. 4,689 పిలికింది. ఈనెల 4వ తేదీ రూ.4,459 ఉండగా బుధవారం సగటు ధర రూ. 4,100 లభించింది. వేరుశనగకు మద్దతు ధర రూ.6,783 ఉంది. మార్కెట్‌లో కేవలం రూ.4,500 వరకు మాత్రమే లభిస్తోంది. ధరలు పడిపోయినపుడు రైతులు నష్టపోకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment