నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి
బేతంచెర్ల: ప్రజలు, పరిశ్రమలకు, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కలెక్టర్ రాజకుమారి అన్నారు. మండల పరిధిలోని కొమ్మూరి కొట్టాల గ్రామ సమీపంలో 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.98.32 కోట్లతో నిర్మించిన 220/132/33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌ను సీఎం చంద్రబాబు నాయుడు గురువారం విజయవాడ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. 2018లో ఈ సబ్ స్టేషన్ మంజూరైందని, గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో పూర్తి కాలేదన్నారు. తమ ప్రభుత్వమే పూర్తి చేసి ప్రారంభించిందన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జమ్మలమడుగు విద్యుత్ ఉప కేంద్రం నుంచి సుమారు 76 కిలోమీటర్ల విద్యుత్ లైన్ ఏర్పాటు చేసి బేతంచెర్ల విద్యుత్ ఉప కేంద్రానికి అనుసంధానం చేసినట్లు చెప్పారు. నంద్యాల, కర్నూలు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉత్పత్తి అయిన సౌర, పవన విద్యుత్‌ను ఏపీ గ్రిడ్‌కు అనుసంధానం చేయడం కోసం ఈ విద్యుత్ ఉప కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ ప్యాపిలి మండలంలో నూతన విద్యుత్ ఉపకేంద్రం ఏర్పాటుకు సహకరించాలని సీఎంను కోరారు. విద్యుత్ ఉప కేంద్రం ఏర్పాటుతో నాపరాతి పరిశ్రమలు అధికంగా ఉన్న బేతంచెర్ల ప్రాంతంలో విద్యుత్ లోఓల్టేజ్ సమస్య, కరెంట్ కోతలు తొలగనున్నట్లు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు.
ఇదీ వాస్తవం..
2018లో ఈ విద్యుత్ ఉప కేంద్రం మంజూరైనా అటవీశాఖ అనుమతులు లేని కారణంగా అప్పట్లో నిర్మాణం నిలిచిపోయింది. 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఢిల్లీ స్థాయిలో అటవీశాఖ అనుమతులు తీసుకొచ్చేందుకు ఎంతో చొరవ చూపారు. అయితే వర్చువల్‌గా ఈ సబ్ స్టేషన్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పూర్తి కాలేదని, తమ ప్రభుత్వమే పూర్తి చేసిందని చెప్పడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు కూడా పూర్తి కాలేదు. అటవీ శాఖ అనుమతులు రావాలంటే మూడు నాలుగు నెలల్లో అయ్యే పని కాదు. ఈ విషయం తెలిసి కూడా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నించారు. తమ పాలనలోనే అనుమతులు తెచ్చి పనులు పూర్తి చేశామని చెప్పడం విడ్డూరం.
కలెక్టర్ రాజకుమారి
విద్యుత్ ఉప కేంద్రాన్ని వర్చ్‌వల్‌గా
ప్రారంభించిన
సీఎం చంద్రబాబు నాయుడు
Comments
Please login to add a commentAdd a comment