కేసులకు భయపడే ప్రసక్తే లేదు
నంద్యాల: కేసులకు భయపడే ప్రసక్తే లేదని ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా అన్నారు. గురువారం రాత్రి పట్టణంలోని ఆత్మకూరు బస్టాండ్‌లో ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యాలయలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2013లో జరిగిన ఘటనపై ఈనెల 2న తనతోపాటు మరికొందరిపై వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారన్నారు. 2013లో బిల్డింగ్ నిర్మాణ విషయంలో షోడాషాప్ యజమాని ఎస్పీ సలాం తనతో ఘర్షణ పడ్డారని, ఈ విషయంపై అప్పట్లో సలాంపై కేసు నమోదు అయ్యిందన్నారు. ఘర్షణ సమయంలో హైదరాబాద్‌లో ఉన్నట్లు చూపించుకుని కేసును సలాం కొట్టి వేయించుకున్నారన్నారు. అయితే ఘర్షణ ఎందుకు పెంచుకోవడం అని తాను పైకోర్టుకు వెళ్లలేదన్నారు. ఈ విషయంలో సలాం కోర్టుకు వెళ్లి తనపై కేసు నమోదు చేయించారని అయినా భయపడేది లేదని, చట్టపరిధిలో న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు.
కేసుకు మసీదు నిర్మాణానికి సంబంధం లేదు
తనపై కేసు నమోదైన కేసుకు జుమ్మా మసీదు నిర్మాణ విషయంలో నిధుల విషయానికీ ఎలాంటి సంబంధం లేదన్నారు. కొన్ని టీవీ చానళ్లు, సోషల్ మీడియాలో నిధుల అవకతవకల విషయంలో కేసు నమోదు చేశారని చెబుతున్నారని, ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. మసీదు అందరి సహకారంతో పూర్తయిందని, ఈ మసీదుకు మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి రూ.10 లక్షలు, దివంగత మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి ఎంపీ నిధులలో రూ.10 లక్షలు అందజేశారని, అందరి సహకారంతో మసీదు నిర్మాణం పూర్తి చేసుకున్నామన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు అమీర్‌బాషా పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఇసాక్‌బాషాపై కేసు నమోదు
ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, మరికొందరిపై ఈనెల 2వ తేదీన కేసు నమోదు చేసినట్లు నంద్యాల వన్‌టౌన్ సీఐ సుధాకర్‌రెడ్డి గురువారం తెలిపారు. 2013లో ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా తనపై తప్పుడు కేసు నమోదు చేయించారని బాధితుడు ఎస్పీ సలాం కోర్టుకు వెళ్లడంతో కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, వన్‌టౌన్ ఎస్‌ఐ మంజునాథరెడ్డి, రసూల్‌ఖాన్‌లతోపాటు మరో ఇద్దరిపై 120బీ, 191, 192, 34, 163 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా
Comments
Please login to add a commentAdd a comment