కుమారులు పట్టించుకోవడం లేదు
కర్నూలు: ‘నాకు ముగ్గురు కుమారులు ఉన్నారు.. బాగా చూసుకుంటామని నా దగ్గర ఉన్న డబ్బు తీసుకున్నారు. దర్గాకు వెళ్దామని తీసుకెళ్లి గుట్టపాడు గ్రామంలో ఉన్న బంధువుల ఇంటి వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయారు. మీరే నాకు న్యాయం చేయండి సారూ’ అంటూ ఓర్వకల్లు గ్రామానికి చెందిన బాహర్‌బీ ఎస్పీ బిందు మాధవ్ వద్ద గోడు వెళ్లబోసుకుంది. కర్నూలు టూటౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న క్యాంపు కార్యాలయంలో ఎస్పీ బిందు మాధవ్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించి నేరుగా వారితో మాట్లాడారు. మొత్తం 107 ఫిర్యాదులు అందాయని, వాటన్నిటిపై చట్టపరిధిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.
వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని..
● తనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారని, తనతో పాటు వారిని కలుపుకుని ఆస్తిలో నాలుగు వాటాలుగా చేసుకుని పెద్దల సమక్షంలో పంపకాలు చేసుకున్నామని, అయితే కుమార్తెలు గోపిలక్ష్మి, భూలక్ష్మి వారి మేనమామ రాముడు కలిసి తనకు ఇంటిలో వాటా లేదని, బయటకు వెళ్లిపోవాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారని కర్నూలు సోమిశెట్టి నగర్‌కు చెందిన చిన్నమ్మ ఫిర్యాదు చేశారు.
● తన ఇద్దరు కుమారులు మద్యానికి అలవాటు పడి అల్లరి పనులు చేస్తూ, తాను వ్యవసాయం చేస్తూ కష్టపడి సంపాదించినదంతా అయిపోగొడుతున్నారని, కౌన్సిలింగ్ ఇచ్చి తన సంసారాన్ని చక్కదిద్దాలని ఎమ్మిగనూరు మండలం రాళ్లదొడ్డి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు.
● కర్నూలు, నంద్యాల జాతీయ రహదారి పక్కనున్న నన్నూరు గ్రామ పంచాయతీ పరిధిలో స్నేహ గ్రీన్ సిటీలో రెండు ప్లాట్లను రూ.14 లక్షలకు కొనుగోలు చేశానని, మూడు నెలల క్రితం ప్లాట్ నెంబర్ రాళ్లను తొలగించి స్నేహ గ్రీన్ సిటీ నిర్వాహకుడు సిద్ధయ్య వేరేవారికి విక్రయించి మోసం చేశాడని అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేశారు.
● కర్నూలుకు చెందిన నాగిరెడ్డి, వెంకటసుబ్బారెడ్డి మధ్యవర్తులుగా ఉంటూ పొలాన్ని తనకు రూ.58.55 లక్షలకు ఇప్పిస్తామని చెప్పి డబుల్ రిజిస్ట్రేషన్ చేయించి మోసం చేశారని, తిరిగి డబ్బు ఇవ్వడం లేదని కర్నూలు వాసు నగర్‌కు చెందిన విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు.
ఎస్పీకి ఫిర్యాదు చేసిన తల్లి
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 107 ఫిర్యాదులు
ఎమ్మిగనూరు నుంచి మంత్రాలయం వెళ్లే రోడ్డులో మూడున్నర ఎకరాల పొలానికి ఆంజనేయులుతోపాటు మరికొందరు రూ.20 లక్షలు తీసుకుని, పొలం పాసు పుస్తకాలు ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ చేయకుండా వేరొకరికి విక్రయించి మోసం చేశారని కర్నూలు చిత్తారి వీధికి చెందిన విజయకుమార్ ఫిర్యాదు చేశారు.
భర్త ఇమ్మానుయేలు ముంబయిలో పనిచేస్తున్నాడని, ఆస్తి కోసం ఆశపడి తనను పెళ్లి చేసుకుని రెండు నెలలు మాత్రమే కాపురం చేసి ఆస్తి తన పేరు మీద వచ్చిన తర్వాత ముంబయి నుంచి వెనక్కు పంపించి మోసం చేశాడని ఆదోని మండిమెట్టకు చెందిన రూప ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment