‘స్మార్ట్‌’గా విద్యుత్‌ ఉచ్చు | - | Sakshi
Sakshi News home page

‘స్మార్ట్‌’గా విద్యుత్‌ ఉచ్చు

Published Tue, Nov 26 2024 1:38 AM | Last Updated on Tue, Nov 26 2024 1:38 AM

‘స్మా

‘స్మార్ట్‌’గా విద్యుత్‌ ఉచ్చు

ప్రభుత్వ, వాణిజ్య సర్వీసులకు

విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లు

గుట్టుగా బిగిస్తున్న అధికారులు

ముందస్తు రీచార్జ్‌ చేసుకోకుంటే

పవర్‌ కట్‌..

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్‌ మీటర్లను చంద్రబాబునాయుడు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రస్తుతం దానికి భిన్నమైన వైఖరిని తీసుకున్నారు. ప్రజానీకం వ్యతిరేకిస్తున్నప్పటికీ ఇళ్లకు స్మార్ట్‌ మీటర్లను బిగించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపడుతోంది. డిసెంబర్‌ నుంచే ఈ మీటర్లను ఇళ్లకు బిగించడానికి సన్నాహాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ డిస్కమ్‌లకు ఇప్పటికే ఆదాని స్మార్ట్‌ మీటర్లు చేరాయి. స్మార్ట్‌ మీటర్లు బిగించేందుకు ఏడాది కాంట్రాక్టు పేరుతో ప్రైవేటు కన్సల్టెన్సీ సంస్థ నియామక ప్రక్రియ చేపట్టింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సర్వీలకు సంబంధించిన 10 వేల సర్వీసులకు స్మార్ట్‌ మీటర్లు బిగించినట్లు విద్యుత్‌ అధికారులు చెబుతున్నారు.

కర్నూలు న్యూసిటీ: రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో చెబుతున్న స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు ప్రక్రియ జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా మొదలైంది. వీటిని తొలి దశలో ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సర్వీసుల మీటర్లకు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా మొత్తం 7,732 ప్రభుత్వ కార్యాలయాల సర్వీసులు ఉండగా .. ఇప్పటి వరకు 3,000 కార్యాలయాల సర్వీసులకు స్మార్ట్‌ మీటర్లను అమర్చారు. ఆ తరువాత వాణిజ్య, గృహ వినియోగదారుల సర్వీసులకు అమర్చుతామని విద్యుత్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. గృహ వినియోగదారుల్లో 800 యూనిట్ల పైబడిన వారికి మాత్రమే తొలుత అమర్చుతారు. ఈ మీటర్ల ఏర్పాటు వల్ల ముందుగా రీచార్జ్‌ చేసుకుంటేనే విద్యుత్‌ ఉంటుంది. లేదంటే కట్‌ చేస్తారు. దీంతో వినియోగదారుల జేబులు గుల్ల కానున్నాయి. పేద, ధనిక వ్యాపారులు అనే తేడా లేకుండా అందరిపైనా స్మార్ట్‌ మీటర్ల పేరుతో విద్యుత్‌ భారాలు పడనున్నాయి. జిల్లాలో వాణిజ్య వినియోగదారుల(కమర్షియల్‌) సర్వీసులు 78 వేలు, గృహ వినియోగదారులు(డొమెస్టిక్‌) 6.5 లక్షల మంది ఉన్నారు. 1.10 లక్షల వ్యవసాయ సర్వీసులు, 3,100 పరిశ్రమల సర్వీసులు, 426 హెచ్‌టీ కనెక్షన్లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్మార్ట్‌ మీటర్లు అమర్చుతున్నారు. వీటిని ఏర్పాటు చేసే కాంట్రాక్టును కేంద్రం అదాని సంస్థకు కట్టబెట్టింది. ప్రస్తుతం వాటిని ఉచితంగా బిగిస్తున్నప్పటికీ భవిష్యత్‌లో ఒక్కో స్మార్ట్‌ మీటరుకు రూ.12 వేలు చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు. జిల్లాలో మొదటి విడతగా ప్రభుత్వ కార్యాలయాలు, ఇండస్ట్రీల సర్వీసులు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ఏర్పాటు పూర్తయ్యాక రెండో విడతగా వ్యాపార సముదాయాలకు, పరిశ్రమలకు, వ్యవసాయ బోర్లకు బిగించే ప్రక్రియను చేపడతారు. ఆతరువాత మూడో విడతగా గృహాలకు స్మార్ట్‌ మీటర్లు పెట్టనున్నారు.

ముందస్తు రీచార్జ్‌ లేకుంటే విద్యుత్‌ కట్‌

స్మార్ట్‌ మీటర్లు వినియోగంలోకి వస్తే నిత్యం వాడే సెల్‌ఫోన్‌ లాగే స్మార్ట్‌ మీటర్లకు ముందుగానే రీచార్జ్‌ చేయాల్సి ఉంటుంది. రీచార్జ్‌ చేసుకోకపోయినా, మర్చిపోయినా కరెంట్‌ దానికదే కట్‌ అయిపోయి ఇళ్లు అంధకారంగా మారుతుంది. మళ్లీ రీచార్జ్‌ చేయాలంటే ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి. ఈ తతంగాన్ని గ్రామీణ ప్రాంతాల్లో చేసుకోలేరనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనివల్ల విద్యుత్‌ శాఖకు లాభం ఉండవచ్చు కానీ సాధారణ ప్రజలకు ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం నెలకు ఒక్కసారి విద్యుత్‌ బిల్లులు కడుతున్నాం. స్మార్ట్‌ మీటర్లు ఇళ్లకు వస్తే రీచార్జ్‌ ఎప్పుడు అయిపోతే అప్పుడు వినియోగదారులు కట్టుకోవాల్సిందే. స్మార్ట్‌ మీటర్లు రావటం ద్వారా తొలుత ఇంటింటికీ తిరిగి బిల్లులు తీసే మీటరు రీడర్లను తొలగించే ప్రమాదం ఉంది.

కేంద్రం నిర్ణయానికి తలొగ్గిన రాష్ట్రం

కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం తలూపింది. వీటి వల్ల ఎక్కడ ఎంత విద్యుత్‌ వినియోగిస్తున్నదీ ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు తెలుస్తుందని, ఓల్టేజీ హెచ్చు తగ్గులు, ట్రాన్స్‌ఫార్మర్లపై పడుతున్న లోడ్‌ వంటి అంశాలు తెలుస్తాయని విద్యుత్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే మొబైల్స్‌ మాదిరిగా డబ్బు కట్టి రీచార్జ్‌ చేసుకోవలసి ఉంటుంది. ప్రస్తుతం విద్యుత్‌ వినియోగించిన తరువాత ప్రతి నెల 10 నుంచి 15 రోజుల వ్యవధిలో బిల్లులు కట్టించుకుంటున్నారు. స్మార్ట్‌ మీటర్లు వచ్చాక అదికుదరదు. నెలకు ఎంత విద్యుత్‌ బిల్లు వస్తుందో సగటున అంచనా వేసి మొత్తాన్ని ముందుగానే చెల్లించి మీటరును రీచార్జ్‌ చేసుకోవలసి ఉంటుంది. ఒకసారి అధికంగా విద్యుత్‌ను వినియోగిస్తే మొత్తం ముందుగానే రీచార్జ్‌ డబ్బులు అయిపోతాయి. అటువంటి సమయంలో వినియోగదారుల మొబైల్‌కు మేసేజ్‌ పంపిస్తారు. దాని ప్రకారం రీచార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుందని విద్యుత్‌ అధికారులు చెబుతున్నారు.

జూలై 25 నాటికి

పూర్తి చేయాలి

వినియెగదారులకు నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు పాత విద్యుత్తు రీడింగ్‌ మీటర్ల స్థానంలో స్మార్ట్‌ మీటర్లను అమర్చుతున్నాం. ఇవి వినియోగదారకుల విద్యుత్తు సమస్యలు వెంటనే పసిగట్టి పరిష్కరించేందుకు ఏంతో దోహదపడతాయి. విద్యుత్‌ బిల్లు చెల్లింపులకు పారదర్శకత పాటించేందుకు ఉపయోగపడతాయి. అన్ని రకాల సర్వీసులకు వచ్చే ఏడాది జులై 25 నాటికి స్మార్ట్‌ మీటర్లు బిగించాలని ప్రభుత్వ ఽఆదేశించింది.

– రాజేష్‌, డిప్యూటీ ఈఈ కన్‌స్ట్రక్షన్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
‘స్మార్ట్‌’గా విద్యుత్‌ ఉచ్చు1
1/2

‘స్మార్ట్‌’గా విద్యుత్‌ ఉచ్చు

‘స్మార్ట్‌’గా విద్యుత్‌ ఉచ్చు2
2/2

‘స్మార్ట్‌’గా విద్యుత్‌ ఉచ్చు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement