కర్నూలు(హాస్పిటల్): తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణ కోసం నూతన ఎంసీపీ కార్డు రూపొందించారని డెమో శ్రీనివాసులు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఫర్హీన్ తబస్సుమ్ చెప్పారు. సోమవారం నగరంలోని శరీన్‌నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలకు ఎంసీపీ కార్డుపై అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చిన్నారులకు సకాలంలో వేయించాల్సిన టీకాలతో కూడిన విలువైన సమాచారంతో ఎంసీపీ కార్డు ఉంటుందన్నారు. కార్డులోని సమాచారం ఆధారంగా గర్భిణికి నవమాసాలు పూర్తయి బిడ్డ ప్రసవించే నాటికి పూర్తి ఆరోగ్యంగా ఉండేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అలాగే ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉంటోందని, చిన్నపిల్లలు, వృద్దులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు అప్రమత్తంగా ఉండాలన్నారు. డిప్యూటీ డెమో చంద్రశేఖర్‌రెడ్డి, ఆరోగ్య విద్యాబోధకులు పద్మావతి, ఆరోగ్య కార్యకర్తలు కళ్యాణి, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment