సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రుణమాఫీ చిక్కులు.. బ్యాంకర్ల కొర్రీలు వెరసి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పూర్తిస్థాయిలో రైతులకు పంట రుణాలు అందడం లేదు. రుణమాఫీ అయినా సాంకేతిక సమస్యలు అడ్డంకిగా మారడంతో వేలాది మంది కొత్త రుణాలకు దూరమయ్యారు. మరోవైపు అర్హులై ఉండి రుణమాఫీకి నోచుకోని వారు సైతం క్రాప్ లోన్ కోసం వెంపర్లాడక తప్పడం లేదు. పాతవి పూర్తిగా చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇస్తామని బ్యాంక్ అధికారులు పెడుతున్న మెలికతో అన్నదాతలు విధి లేని పరిస్థితుల్లో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి.. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.
లక్ష్యం.. బహుదూరం
ప్రతి ఆర్థిక సంవత్సరం బ్యాంకర్లు ప్రకటిస్తున్న రుణ ప్రణాళికలు రికార్డుల ప్రకారం ఘనంగా ఉన్నప్పటికీ.. అమలులో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. 2020 నుంచి ఈ ఏడాది ఇప్పటివరకు ఆర్థిక సంవత్సరాల వారీగా ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో వందశాతం రుణ లక్ష్యాన్ని చేరుకున్న దాఖలాలు లేవు. గరిష్టంగా 60 శాతానికి మించి రుణ లక్ష్యం చేరుకోలేదు. ప్రతి ఏటా లక్ష్యం బహుదూరంగానే ఉందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
కొత్తగా ‘సాంకేతిక’ ఇబ్బందులు..
రుణమాఫీ వర్తించినా.. వివిధ సాంకేతిక కారణాలతో బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమకాని వారు ఉమ్మడి జిల్లాలో సుమారు 30వేల మంది ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఆధార్, లోన్ అకౌంట్లకు పేరు సరిపోలకపోవడం, ఆధార్ నంబర్ కరెక్ట్ లేకపోవడం, ఫ్యామిలీ గ్రూప్‌లో వేరే వారి పేరు చేరడం, ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి ఉండడం, పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్‌లో పేరు సరిపోలకపోవడం, రేషన్ కార్డు లేకపోవడం వంటి కారణాలతో వారి వారి ఖాతాల్లో డబ్బులు జమకాలేదు. ఈ క్రమంలో వారికి కొత్తగా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు వెనుకంజ వేస్తున్నారు. ఈ క్రమంలో సదరు రైతులు ఇటు రుణమాఫీ అమలు కోసం.. అటు పంట రుణాల కోసం బ్యాంకర్ల చుట్టూ నిత్యం ప్రదక్షిణలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment