నారాయణపేట: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సదరు అధికారులపై వేటు వేసేందుకు వెనకాడబోమని కలెక్టర్ సిక్తా పట్నాయక్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని ఎరగ్రుట్ట కస్తూర్బా పాఠశాల, బాలికల గురుకుల పాఠశాల, సింగారం మలుపులోని దామరగిద్ద బాలుర వసతి గృహం, ధన్వాడ కేజీబీవీలను కలెక్టర్ తనిఖీ చేసి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో అల్పాహారం మధ్యాహ్న, రాత్రి భోజనం ఎలా ఉంటుందని ఆరా తీయడంతోపాటు రోజూ ఉపాధ్యాయులు రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు అల్పాహారం, భోజనాన్ని వడ్డించాలని ఆదేశించారు. బియ్యం సరిగా లేకపోతే తిరిగి పంపించాలని, గుడ్లు, కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకుల నాణ్యతను ఒకటికి రెండుసార్లు పరిశీలించిన తర్వాతే వాటిని వంటకు వినియోగించాలన్నారు. ఉదయం వచ్చే పాల నుంచి మొదలుకొని రాత్రి భోజనం వరకు ఎవరెవరు భోజనాన్ని పరిశీలిస్తున్నారనే విషయాన్ని ముందుగానే తెలపాలని చెప్పారు. ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. మోనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని వార్డెన్ల ను ఆదేశించారు. ధన్వాడ కేజీబీవీలో వంటగది, స్టోర్ రూమ్ శుభ్రంగా లేకపోవడం, 323 మందికి కొద్దిపాటి కూర ఏం సరిపోతుందని, చారు నీళ్లలా ఉండడంపై ఉపాధ్యాయులను ప్రశ్నించారు. ఈ వంటలను రికార్డ్ చేసి శనివారం ఉదయం మళ్లీ వచ్చి వంటలను పరిశీలించాలని తహసీల్దార్ సింధుజను కలెక్టర్ ఆదేశించారు. ఈ విషయాన్ని రిపోర్ట్ రాసి సంజాయిషీ ఇవ్వాలని సూచించారు. అలాగే అడిషనల్ కలెక్టర్ బెన్ షాలం మక్తల్, ట్రైనీ కలెక్టర్ గరిమా నరుల దామరగిద్దలోని కేజీబీవీలు, వసతిగృహాలను సందర్శించి భోజనాన్ని పరిశీలించారు.
విద్యార్థులకు నాణ్యమైన ఆహారంఅందించాలి
వసతి గృహాలు, పాఠశాలలను పరిశీలించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్
Comments
Please login to add a commentAdd a comment