ప్రాధాన్యత రంగాలకు రుణాలు: కలెక్టర్
నారాయణపేట: ప్రాధాన్యత కలిగిన వ్యవసాయ, ఎంఎస్‌ఎంఈ రంగాలకు అధిక రుణాలు మంజూరు చేసి జిల్లా అభివృద్ధికి బ్యాంకర్లు సహకరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని వీసీహాల్‌లో ఏర్పాటు చేసిన డీసీసీ సమావేశానికి చైర్మన్‌గా కలెక్టర్, కో కన్వీనర్‌గా లీడ్ బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ వ్యవహరించారు. ఈ సమావేశంలో వార్షిక ప్రణాళికా సంబంధించిన 2024–25 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసానికి రూ.1359.11 కోట్లతో త్రైమాసిక వృద్ధి, వార్షిక ప్రణాళికలో 41.59 శాతం, ఎస్‌ఎంఈ సెగ్మెంట్ సంబందించి రూ.96.66 కోట్లతో 38.41 శాతం ప్రగతి, ప్రాధాన్యత రంగానికి రూ.1211.01 కోట్లు రుణాలు మంజూరు చేయడం జరిగిందని ఎల్‌డీఎం విజయ్ కుమార్ వెల్లడించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాధాన్యత రంగాలకు బ్యాంకర్లు అధిక రుణాలు ఇవ్వాలన్నారు. అలాగే రుణమాఫీ పొందిన రైతులకు ఈ నెలాఖరిలోగా రెన్యూవల్ ప్రక్రియ పూర్తి చేసి రైతులకు రుణమాఫీ లబ్ధి చేకూర్చే విధంగా బ్యాంకర్లు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఆర్‌బీఐ నుంచి బి.పల్లవి, నాబార్డు అధికారి షణ్ముఖచారి, ఎస్‌బీఐ ఏజీఎం అనిల్ కుమార్, జిల్లాలోని అన్ని బ్యాంకుల ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొని వివిధ సమస్యలపై చర్చించి తగిన నిర్ణయాలు తీసుకున్నారు. డీఆర్డీఓ మొగులప్ప మాట్లాడుతూ.. మహిళా శక్తి పథకం కింద క్యాంటీన్లు, ఆర్టీసీ బస్సులు, సోలార్ ఎనర్జీ వంటి పథకాలను ప్రోత్సహిస్తున్నామని, వారికి బ్యాంకర్లు సహకారం అందించాలని కోరారు. జీఎండిఐసీ మహేష్ మాట్లాడుతూ పీఎం విశ్వకర్మ పథకం కింద ట్రైనింగ్ తీసుకున్న లబ్ధిదారులకు బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాలని కోరారు.
ప్రజాసేవకుఅంకితం కావాలి
నారాయణపేట: శాంతి భద్రతలను పరిరక్షిస్తూ పోలీసుల కీర్తి ప్రతిష్టలు పెంపొందించే దిశగా నిరంతరం కృషి చేయాలని, పోలీస్ శాఖలో ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో ఉండి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ సూచించారు. శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో 9 నెలల శిక్షణ పూర్తి చేసుకొని వచ్చిన 78మంది ట్రైనీ కానిస్టేబుళ్లతో సమావేశమయ్యారు. సమాజానికి అత్యున్నతమైన సేవలు అందించే అవకాశం ఉన్న పోలీస్ శాఖలో చేరి శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు పూర్తి బాధ్యతతో విధులు నిర్వర్తించాలన్నారు. స్టేషన్లలో తమకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలని, ప్రధానంగా ప్రజల రక్షణ మన బాధ్యత అని, అవినీతి ఆరోపణలు లేకుండా, ప్రలోభాలకు గురికాకుండా నీతి నిజాయితీతో విధులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో సిఐ రామ్ లాల్, ఆఫీస్ సూపరింటెండెంట్ శంకర్ లాల్, సిఐలు శివశంకర్, రాములు పాల్గొన్నారు.
డీఈఓగా గోవిందరాజులు
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లా విద్యాశాఖ అధికారిగా (ఎఫ్‌ఏసీ) గోవిందరాజులును నియమిస్తూ శుక్రవారం డైరక్టర్ ఆఫ్‌స్కూల్ ఎడ్యుకేషన్ వెంకట నర్సింహారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మాగనూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అందించిన భోజనం వికటించి విద్యార్థులు ఆస్పత్రి పాలైన సంఘటనతో డీఈఓ అబ్ధుల్ ఘనీని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. దీంతో ఆయన స్థానంలో గోవిందరాజులను నియమించారు.
కార్మిక వ్యతిరేకవిధానాలపై పోరాటం
నారాయణపేట: ప్రధాని నరేంద్ర మోడీ పదేళ్ల పరిపాలనలో ఎన్నికల వాగ్దానాలు విస్మరించి, రైతుకు, కార్మిక వర్గానికి మరణ శాసనం లిఖించాడని, సంఘటితంగా వీటిపై పోరాడాలని సీపీఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు ఎస్‌ఎల్ పద్మ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా సదస్సు బలరాం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు పండించిన ధరకు గిట్టుబాటు ధరలు లేవని, నిత్యావసర సరుకుల ధరలను పెంచి ప్రజలనడ్డి విరుస్తున్నారన్నారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను, వ్యవసాయ వ్యతిరేక మూడు నల్ల చట్టాలను మోడీ సర్కార్ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈనెల 26న జరిగే దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో కార్మికులు కర్షకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment