ఇదేం కూడు.. మా పిల్లల్ని చంపుతారా?
నారాయణపేట/మక్తల్/మాగనూర్/కృష్ణా: మాగనూర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో మధ్యాహ్న భోజనం వికటించి, 40 మంది విద్యార్థులు ఆస్పత్రిపాలు కావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఇదేం కూడు.. మా పిల్లలను చంపుతారా అంటూ అధికారులపై మండిపడ్డారు. విద్యార్థులు అస్వస్థతకు గురై మక్తల్ ఆస్పత్రిలో 30 మంది చేరారని సమాచారం అందుకున్న తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని కన్నీరు పెట్టారు. ఏ సమయంలో ఎం జరుగుతుందోనని భయందోళన చెందుతున్నారు.
అస్వస్థతకు గురైన విద్యార్థులు వీరే..
మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులు అనిత, లక్ష్మి, పవన్, శ్రీలక్ష్మి అరిచుత్, అనిల్, శంకర్, నర్సింహులు, అఖిల, మధుసూదన్, స్వాతి, నాగమణి, మల్లికార్జున్, శివకుమార్, నీరుక, పూజ, రాజు, వివకుమార్, నరేందర్, శ్రీవాణి, భూమిక, శ్రీవాణి, శైలజ, దీపిక, సంగీత, రాజేశ్వరి, నేత్రలకు మాగనూర్ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్సలు నిర్వహించారు. పరిస్థితి చెయ్యి దాటే పరిస్థితి ఉందని వైద్యులు చెప్పడంతో అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులకు మెరుగైన చికిత్సలను అందిస్తున్నారు.
ఆస్పత్రిని సందర్శించిన ఎమ్మెల్యే..
మక్తల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పరామర్శించి, దైర్యం చెప్పారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అదే విధంగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అక్కడికి చేరుకుని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
తాగునీటిని పరిశీలించాలి..
తాగునీరు బాగా లేకపోవడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురై ఉండవచ్చని డీఎంవహెచ్‌ఓ సౌభాగ్యలక్ష్మి చెప్పుకొచ్చారు. ఘటన సమాచారం అందుకున్న ఆమె.. మాగనూర్ పాఠశాలను ఆర్‌ఐ శ్రీశైలం, ఎస్‌ఐ అశోక్‌బాబు, వైద్య సిబ్బందితో కలిసి సందర్శించారు. భోజనం, తాగునీరు, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు తాగునీటిని అందించే ట్యాంకులు అపరిశుభంగా ఉండటం.. సత్యసాయి నీటితో పాటు బోరునీరు కలిసి వస్తుండటం ఈ సమస్యకు కారణమై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. వండిన ఆహారంతో పాటు తాగునీటిని ల్యాబ్‌కు పంపించి పరిశీలిస్తామన్నారు.
అధికారులపై తల్లిదండ్రుల ఆగ్రహం
మక్తల్ ఆస్పత్రిని సందర్శించిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి
Comments
Please login to add a commentAdd a comment