మహిళా సంఘాలకు యూనిఫాం
కోస్గి: పేదరికంతో బాధపడుతున్న కుటుంబాల్లో వెలుగులు నింపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం మహిళలతో స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయించి అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుంది. సభ్యులతో పొదుపు చేయిస్తూనే బ్యాంకు రుణాలు ఇప్పించి వ్యాపారాల నిర్వహణతో ఆర్థికంగా ఎదుగుదలకు దోహదపడుతుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాల్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పలు కొత్త పథకాల అమలుకు సిద్ధమైంది. ఇందిరా మహిళా శక్తి పథకంతో కోటీశ్వరులను చేయాలన్న కృతనిశ్ఛయంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. తాజాగా మహిళా సంఘాల్లో ఉన్న మహిళలందరికీ ఒకే విధంగా డ్రస్‌కోడ్ అమలు చేయాలనే లక్ష్యంతో ఏకరూప దుస్తులు అందించాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం అమలు చేసిన బతుకమ్మ చీరల పథకాన్ని రద్దు చేసి నూతనంగా అమలు చేస్తున్న ఏకరూప చీరల పంపిణీకి రంగం సిద్ధం చేస్తుంది.
ఏడాదికి రెండు చీరల చొప్పున..
ఏకరూప దుస్తుల పంపిణీతో మహిళా సంఘాల సభ్యులను గుర్తించడం సులభం. జిల్లాల వారీగా రెండు, మూడు రంగుల చీరలు అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఏడాదికి రెండు చీరల చొప్పున చీరల పంపిణీకి కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు లేత నీలి రంగు, మువ్వన్నెల అంచు డిజైన్‌తో కూడిన చీరలను పంపిణీ చేసేందుకు డిజైన్‌లు ఖరారు చేశారు.
నాణ్యమైనవి అందిస్తేనే..
గత ప్రభుత్వం హయాంలో బతకమ్మ పండగకు కానుకగా మహిళలకు చీరలు పంపిణీ చేసిన విషయం విధితమే. కొన్ని చోట్ల నాసీరకంగా ఉండడంతో నిరసన సైతం తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడైనా నాణ్యతగా ఉండేలా చూడాలని, రూ.కోట్లలో నిధులు వెచ్చించి ధరించేందుకు అనువుగా లేని చీరలు ఇస్తే ప్రయోజనం ఉండదని మహిళలు పేర్కొంటున్నారు.
నాణ్యమైన చీరలు అందించాలి
గతంలో ప్రభుత్వం బతుకమ్మ చీరలు అందించినప్పటికి నాణ్యత లేకపోవడంతో మహిళలు చీరలు తీసుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం మహిళా సంఘాల సభ్యులందరికి ఒకేరకమైన చీరలు అందించాల నే నిర్ణయం మంచిదే. నాణ్యమైన చీరలు అందిస్తేనే ప్రయోజనం ఉంటుంది. – అచ్చమ్మ,
గ్రామ సంఘం అధ్యక్షురాలు, గొర్లోని బావి
మార్గదర్శకాలు అందాల్సి ఉంది
ప్రభుత్వం మహిళా సంఘాలకు ఒకే డ్రస్ కోడ్ అమలు చేయాలని నిర్ణయించింది. ఏడాదికి రెండు వరకు చీరలు అందించాలని నిర్ణయించినట్లు మౌఖిక సమాచారం. ఇప్పటికే జిల్లాలోని మహిళా సంఘాల సభ్యుల పూర్తి వివరాలు అందజేశాం. ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా ముందుకు సాగుతాం.
– మొగులప్ప, పీడీ, డీఆర్‌డీఓ
ఏకరూప దుస్తుల పంపిణీకిప్రభుత్వ నిర్ణయం
జిల్లాలో 1.20 లక్షల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment