న్యూఢిల్లీ: టెన్త్ పేపర్ లీకేజ్ కేసులో టీడీపీ నేత నారాయణకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఈకేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. సెషన్స్ కోర్టులో కేసు విచారణ చేపట్టాలని ఆదేశించింది. మెరిట్ ఆధారంగానే విచారణ కొనసాగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బెయిల్ రద్దుపై సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై వారం రోజుల్లో హైకోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించింది. అప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సూచించింది. నారాయణకు అరెస్టు నుంచి వారం పాటు తాత్కాలిక రక్షణ కల్పించింది.
నారాయణ విద్యాసంస్థలతో నారాయణకు సంబంధం లేదని ఆయన తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్ర వాదించారు. 2014లోనే నారాయణ విద్యాసంస్థల చైర్మన్ పదవికి రాజీనామా చేశానని కోర్టుకు వెల్లడించారు. ర్యాంకుల కోసం పేపర్ లీకేజీ చేస్తున్నారని నారాయణ విద్యాసంస్థలపై ఆరోపణలున్నాయి. తమకు రాష్ట్రస్థాయి ర్యాంకులు వచ్చాయని పబ్లిసిటీ చేస్తూ విద్యా వ్యాపారం చేస్తున్నాయి.
మొదటి నుంచి వివాదాలు
కాగా, నారాయణ విద్యా సంస్థలపై మొదటి నుంచి వివాదాలున్నాయి. విద్యార్థులపై అధిక ఒత్తిడి తెస్తారనే ఆరోపణలున్నాయి. తమ విద్యాసంస్థల్లో లక్షల మందిని జాయిన్ చేసుకుంటారు. కొంచెం బాగా చదివే వారిని ఎంచుకుంటారు. వారి కోసం పరీక్షల సమయంలో పేపర్ లీకేజీ చేయించి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు తెప్పించి పబ్లిసిటీ చేయించుకోవడం పరిపాటిగా మారిందని అనేకమంది చెబుతున్న మాట.
ఆ విద్యాసంస్థల్లో నిర్భంద విద్యతో మానసిక ఒత్తిడికి లోనైన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలున్నాయి. గత టీడీపీ హయాంలోనే పదుల సంఖ్యలో విద్యార్థులు బలవన్మరాణానికి పాల్పడ్డారు. మంత్రిగా ఉన్న నారాయణపై ఎలాంటి కేసుల్లేకుండా చేసుకోవడంపై గత ప్రభుత్వంపై ఆరోపణలొచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment