ప్రతీకాత్మక చిత్రం
దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీ విజయానికి అనుకూల పరిస్థితులున్న నేపథ్యంలో ఎన్డీయే కూటమిలో చేరేందుకు పలు పార్టీలు ఆసక్తిచూపుతున్నాయి. ఈ క్రమంలో ఎన్డీయేలోకి బీజేడీ(బిజూ జనతా దళ్ పార్టీ) చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీ, బీజేడీ మధ్య సంప్రదింపులు కూడా జరగడం విశేషం.
కాగా, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బీజేడీ.. బీజేపీతో కలిసి ముందుకు వెళ్లేందుకు రెడీ అవుతోందా?.. దాదాపు 15 ఏళ్ల తర్వాత తిరిగి ఎన్డీయేతో చేతులు కలపబోతోందా? అంటే నిజమేనని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ఎన్డీయేలో చేరిక, బీజేపీతో పొత్తుపై తాజాగా సీఎం నవీన్ పట్నాయక్ అధికారిక నివాసం ‘నవీన్ నివాస్’ బీజేడీ నేతల విస్తృతమైన సమావేశం జరిగింది.
►ఇక, ఇదే సమయంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఢిల్లీలో పార్టీ కీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సమాల్‌తో పాటు కీలక నేతలు ఢిల్లీలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఎన్నికల వ్యూహాలు, బీజేడీతో పొత్తు అవకాశాలపై చర్చించారు.
►మరోవైపు.. బీజేడీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే దేబి ప్రసాద్ మిశ్రా పొత్తుపై చర్చించినట్టు మీడియాకు తెలిపారు. కానీ, ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అయితే, తాము ఏ నిర్ణయం తీసుకున్నా.. ఒడిషా ప్రజల ప్రయోజనం కోసమేనని చెప్పుకొచ్చారు.
►ఇదిలా ఉండగా.. బీజేపీ సీనియర్ నాయకుడు, ఎంపీ జుయల్ ఓరం మాట్లాడుతూ.. బీజేడీతో పొత్తుపై ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన సమావేశంలో చర్చించామని వెల్లడించారు. అయితే తుది నిర్ణయం మాత్రం పార్టీ కేంద్ర నాయకత్వానిదేనని స్పష్టం చేశారు. ఫైనల్ నిర్ణయం పార్టీ కేంద్ర నాయకత్వమే తీసుకుంటుందని అన్నారు.
అంతకుముందు ఇలా..
గతంలో 1998లో బీజేపీ, బీజేడీ మధ్య పొత్తు కుదిరింది. ఇందులో భాగంగా 1998, 1999, 2004లో లోక్‌సభ ఎన్నికలు, 2000, 2004 సంవత్సరాలలో అసెంబ్లీ ఎన్నికలలో ఇరు పార్టీలు సత్తా చాటాయి. కాగా, అనూహ్యంగా 2009లో సీట్ల పంపకాల విషయంలో ఇరు పార్టీల మధ్య విభేదాలు వచ్చాయి. అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో బీజేడీకి తక్కువ స్థానాలు ఇవ్వడంతో కూటమి విడిపోయింది. ఇక, తాజాగా మరోసారి దాదాపు 15 ఏళ్ల తర్వాత రెండు పార్టీల మధ్య పొత్తులపై చర్చలు జరగడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment