న్యూఢిల్లీ: కాంగ్రెస్ మహిళా నేత సుప్రియా శ్రీనాథే, బీజేపీ నేత దిలీప్ ఘోష్‌లకు కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మహిళలను కించపరిచేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈసీ ఈ చర్యలు చేపట్టింది. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎన్నికల కోడ్)ని ఉల్లంఘించినట్లు ఈసీ తెలిపింది. మార్చి 29 సాయంత్రం 5 గంటల వరకు సుప్రియా శ్రీనాథే, దిలీప్‌ఘోష్ తమ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని పేర్కొంది.
కాగా హిమాచల్ ప్రదేశ్‌లోని మండి స్థానం నుంచి కంగనా రనౌత్‌ను బీజేపీ ఎన్నికల బరిలోకి దించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కంగనా అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తూ సుప్రియా శ్రీనాథే సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారమే రేపాయి. అనంతరం ఆమె ట్వీట్‌కు కంగనా ధీటుగా బదులిచ్చారు. అయితే ఆ పోస్టు తాను చేయలేదని, తన సోషల్ మీడియా అకౌంట్ యాక్సెస్ కలిగిన ఎవరో చేసి ఉంటారని సుప్రియా తెలిపారు.
మరోవైపు పశ్చిమ బెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కూడా మహిళా గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడంపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. బర్ధమాన్-దుర్గాపూర్ లోక్‌సభ స్థానం నుంచి లోక్‌సభ బరిలో నిలిచచిన దిలీప్ ఘోష్ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ కుటుంబ నేపథ్యాన్ని ఎగతాళి చేశారు. రాష్ట్ర కుమార్తెగా చెప్పుకుంటున్న మమతా..ముందుగా తన తండ్రి ఎవరో నిర్ణయించుకోవాలని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే మహిళల గౌరవాన్ని తగ్గిస్తూ.. అభ్యంతరకరమైన, అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ ఇరు నేతలకు ఈసీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది.
చదవండి: సీఎం పినరయ్ విజయన్ కుమార్తెపై మనీ లాండరింగ్ కేసు
Comments
Please login to add a commentAdd a comment