దేశం అంతటా వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా గోవాలోని రైల్వే సొరంగ మార్గంలోకి నీరు చేరడంతో కొంకణ్ రైల్వే రూట్‌లో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలోని పాతాళగంగ లాంగ్సీ టన్నెల్ సమీపంలో భారీగా కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్ జాతీయ రహదారిని మూసివేశారు. రానున్న మూడు, నాలుగు రోజుల పాటు 17 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
బీహార్, హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, మేఘాలయలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తూ భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ జారీచేసింది. తూర్పు ఉత్తరప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, గోవాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా జూలై 12-14 మధ్య మహారాష్ట్ర, కోస్టల్ కర్ణాటకలో భారీ వర్ష సూచనను అందిస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో జులై 11-13 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జమ్ముకశ్మీర్, లడఖ్, తూర్పు రాజస్థాన్ సహా దక్షిణ భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా, మండీ, కాంగ్రా, కిన్నౌర్, కులు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా 28 రోడ్లపై ట్రాఫిక్ స్తంభించింది. 32 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, 16 నీటి సరఫరా ప్రాజెక్టులు నిలిచిపోయాయి. అసోంలోని 26 జిల్లాల్లో 17 లక్షల మందికి పైగా ప్రజలు వరదల ప్రభావానికి గురయ్యారు. రాష్ట్రంలో వరదల కారణంగా ఇప్పటి వరకు 84 మంది మృతి చెందారు. కొండచరియలు విరిగిపడటం, తుఫాను కారణంగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కజిరంగా నేషనల్ పార్క్‌లో వరదల కారణంగా తొమ్మిది ఖడ్గమృగాలు సహా మొత్తం 159 వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోయాయి.
Comments
Please login to add a commentAdd a comment