
దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావిడీ నెలకొంది. లోక్‌సభతోపాటు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ప్రచారాలతో ప్రధాన పార్టీలన్నీ హోరెత్తిస్తున్నాయి. గెలుపే ధ్యేయంగా దూసుకుపోతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఓ పెద్ద మార్పు సంభవిస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ పార్లమెంట్ స్థానాల్లో గాంధీ కుటుంబ సభ్యులు పోటీ చేసే అవకాశం లేదని ప్రచారం జోరుగా నడుస్తోంది.
2024 మార్చి 10న లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి, రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ యూనిట్ ఏకగ్రీవంగా తీర్మానించింది. అయితే ఇప్పుడు వారిరువురు ఆ స్థానాల్లో పోటీ చేయకపోవచ్చని సమాచారం.
ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి పోటీ చేయకపోవచ్చు. రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుంచి మాత్రమే పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం మీద పార్టీ అధికారిక ప్రకటన వెల్లడించలేదు. కాబట్టి ఇది నిజమా.. లేక ఒట్టి ప్రచారమేనా అనే విషయాలు తెలియాల్సి ఉంది.
2019లో సిట్టింగ్ ఎంపీ.. కాంగ్రెస్ నేత 'రాహుల్ గాంధీ' అమేథీలో ఓటమిని చవిచూశారు. బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో సుమారు 55, 000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాగా మరోసారి ఈ నియోజకవర్గంలో 'స్మృతి ఇరానీ'కి బీజేపీ అవకాశం కల్పించింది.
అమేథీ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీకి కేవలం నియోజకవర్గం మాత్రమే కాదు, 1967 నుంచి ఈ ప్రాంతానికి నెహ్రూ, గాంధీకి అవినాభావ సంబంధం ఉంది. అంతటి కాంగ్రెస్ ప్రతిష్టాత్మక ప్రాంతం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయరు అనే వార్తలు.. కార్యకర్తల్లో కొంత ఆందోళన కలిగిస్తున్నట్లు సమాచారం.
1980లో సంజయ్ గాంధీ అమేథీ గెలుచుకున్నారు. ఈయన మరణాంతరం రాజీవ్ గాంధీ ప్రవేశించారు. 1991లో రాజీవ్ గాంధీ చనిపోయే వరకు అమేథీ వారి చేతుల్లోనే ఉండేది. రాజీవ్ గాంధీ మరణించిన తరువాత 1999 సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహించిన స్థానాన్ని 2004లో రాహుల్ గాంధీ చేజిక్కించుకున్నారు. అయితే 2019లో ఓటమిపాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment