శ్రీ కృష్ణుని జన్మస్థలి మధుర, లీలాస్థలి బృందావనం.. ఈ రెండూ భక్తులకు భక్తి భావాన్ని పెంపొందింపజేస్తాయని అంటారు. శ్రీకృష్ణుని అపార ప్రేమకు ఈ రెండు ప్రాంతాలు నిదర్శనంగా నిలిచాయి. తాజాగా ఒక ముస్లిం మహిళ తన అపార భక్తిభావనతో బృందావనం చేరుకుని, శ్రీకృష్ణుని భక్తిలో మునిగితేలుతోంది.
షబ్నం.. ఉత్తరప్రదేశ్‌లోని మురాదాబాద్‌లోని జిగర్ కాలనీ నివాసి ఇక్రమ్ హుస్సేన్ కుమార్తె. ఇక్రమ్ వంటపాత్రలతో పాటు లోహ విగ్రహాలను తయారు చేస్తుంటాడు. షబ్నంనకు చిన్నప్పటి నుంచే హిందూ దేవీదేవతలపై ఆరాధనా భావం ఏర్పడింది. ఇదే ఆమెను కృష్ణునిపై ప్రేమకు, ఆపై బృందావనానికి పయనమయ్యేలా చేసింది. నాలుగు నెలల క్రితం ఆమె.. చేతిలో లడ్డూ పట్టుకున్న బాలగోపాలుని విగ్రహాన్ని తీసుకుని బృందావనం చేరుకుంది. ఇక్కడి గోవర్థన ప్రదక్షిణ మార్గంలోని గోపాల ఆశ్రమంలో ఆశ్రయం పొందింది. దీంతో ఇక్కడే ఉంటూ శ్రీకృష్ణుని భక్తిలోనే తన జీవితం అంతా గడపాలని నిశ్చయించుకుంది.
2000లో షబ్నంకు ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తితో నిఖా జరిగింది. ఐదేళ్ల తరువాత ఆమకు భర్త తలాక్ చెప్పాడు. దీంతో ఆమె తన తండ్రి ఇక్రమ్ ఇంటికి తిరిగివచ్చి కొన్నాళ్లు అక్కడే ఉంది. తరువాత షబ్నం ఢిల్లీ చేరుకుని మొదట ఒక ప్రేవేట్ కంపెనీలో, ఆ తరువాత లేడీ బౌన్సర్‌గానూ పనిచేసింది. శ్రీకృష్ణునిపై తనకు ఏర్పడిన ప్రేమ గురించి షబ్నం మాట్లాడుతూ ఇప్పుడు తాను తన కుటుంబ సభ్యులందరితో బంధాన్ని తెంచుకున్నానని, ఎవరితోనూ మాట్లాడటం లేదని తెలిపింది. శ్రీ కృష్ణుడే తనకు సర్వస్వం అని, అందుకే అందరికీ దూరంగా ఉన్నానని తెలిపింది.
ఇది కూడా చదవండి: యువత పాడైపోతున్నదంటూ సంగీత పరికరాల దహనం!
Comments
Please login to add a commentAdd a comment