సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ కేసులు మంగళవారం రెండు నెలల కనిష్టస్దాయిలో నమోదైన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహమ్మారిపై మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. వ్యాక్సిన్ బయటకు వచ్చే వరకూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. భౌతిక దూరం పాటించడం వంటి కోవిడ్-19 నిబంధనలను విధిగా పాటించాలని వైరస్ ముప్పు మనల్ని ఇంకా వెంటాడుతూనే ఉందని అన్నారు.
కేంద్ర మాజీ మంత్రి బాలాసాహెబ్ విఖే పాటిల్ ఆటోబయోగ్రఫీని విడుదల చేసిన అనంతరం ప్రధాని మాట్లాడుతూ మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనల విషయంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించరాదని కోరారు. కరోనా వైరస్ ప్రమాదం ఇంకా కొనసాగుతోందని, మహారాష్ట్రలో పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని వ్యాక్సిన్ వచ్చేవరకూ జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కాగా, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 55,342గా నమోదైంది. ఆగస్ట్ 18 తర్వాత కేసుల సంఖ్య ఈరోజు అతితక్కువగా నమోదైంది. గత నెలలో 90,000కు పైగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నమోదవగా తాజాగా ఆ సంఖ్య సగానికి పడిపోయింది. ఇక తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 71.75 లక్షలకు చేరగా మరణించిన వారి సంఖ్య 1,09,856గా నమోదైంది. చదవండి : ‘గ్రామీణ భారతంలో చారిత్రక ఘట్టం’
Comments
Please login to add a commentAdd a comment