ఇజ్రాయెల్‌లో మనోళ్లు భద్రమేనా..?
● ఇరాన్ దాడులతో కుటుంబీకుల ఆందోళన ● అప్రమత్తమవుతున్న జిల్లా ప్రవాసీలు.. ● బంకర్లలో తలుదాచుకుంటున్నట్లు ‘సాక్షి’తో వెల్లడి ● కొత్తగా వెళ్లేవారిలో భయాందోళనలు
కొత్తగా వెళ్లేవారిలో ఆందోళన...
ఉపాధి నిమిత్తం ఇజ్రాయెల్‌కు వెళ్లి యుద్ధంతో అక్కడ అవస్థలు పాలతున్న కార్మికుల పరిస్థితి అలాఉంటే.. ప్రస్తుతం వీసా చేతికి వచ్చి ఇదే నెలలో ఇజ్రాయెల్ వెళ్లనున్న జిల్లాకు చెందిన కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. సారంగాపూర్ మండలం తాండ్ర గ్రామానికి చెందిన రొడ్డవేని స్వామి, సోన్ మండలం జాఫ్రాపూర్ గ్రామానికి చెందిన సాయన్న ఇదే నెలలో ఇజ్రాయెల్ దేశానికి వెళ్లనున్నారు. లక్షల రూపాయలు వెచ్చించి ఉపాధి నిమిత్తం వెళ్తున్న తమకు ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితులు భయాందోళన గురిచేస్తున్నాయని పేర్కొన్నారు.
నిర్మల్ ఖిల్లా: గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దేశానికి ఉపాధి నిమిత్తం వెళ్లిన జిల్లా వాసులు ఎలా ఉన్నారోనని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. రాకెట్ లాంచర్ల, క్షిపుణుల దాడిలో వందలాది మంది మృతి చెందుతున్నట్లు ప్రసార మాధ్యమాల్లో సమాచారం వెలువడుతున్న దృష్ట్యా అక్కడి వెళ్లినవారి కుటుంబాల్లో అలజడి చెలరేగుతోంది. ఇజ్రాయెల్‌లో ఖానాపూర్, నిర్మల్, భైంసా ప్రాంతాలకు చెందిన 100 నుంచి 150 మంది యువకులు ఉపాధి పొందుతున్నట్లు సమాచారం. దాడులు జరుగుతున్న ప్రాంతంలో చాలామంది పనులు నిర్వర్తిస్తున్నారు. ఇందులో ఎక్కువ మంది 25 నుంచి 50 ఏళ్లలోపు వయసువారే. ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో వారున్నారు. ఉపాధి నిమిత్తం ఇజ్రాయెల్ వెళ్లిన సారంగాపూర్ మండలం కంకెట గ్రామానికి చెందిన పుస్పుర్ సారంగధర్ ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడుతూ.. ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్‌లో ఉపాధిపొందుతున్న తామంతా ఇప్పటివరకు క్షేమంగానే ఉన్నట్లు తెలిపాడు. ఆకస్మికంగా జరుగుతున్న దాడులతో ఇజ్రాయెల్‌లోని మన పౌరులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. మూడు, నాలుగు రోజుల నుంచి బాంబుదాడులు కొనసాగుతున్న నేపథ్యంలో తాము బంకర్లలో తలదాచుకుంటున్నట్లు తెలిపారు. కార్మికుల బృందం యుద్ధ సైరన్ మోగగానే బంకర్‌లోకి వెళ్తున్నట్లు పేర్కొన్నారు. దాడులు జరుగుతున్న సమీప ప్రాంతాలలో మన జిల్లా వాసులు స్వల్పసంఖ్యలో ఉన్నట్లు ఆయన తెలిపారు. రాకెట్లు, మిస్సైల్స్ దూసుకొస్తున్న కొద్దీ నిమిషాల ముందు సైరన్ మోగుతుందని పేర్కొన్నాడు. వెంటనే అక్కడి సమీప ప్రాంతాల్లోని ప్రజలందరూ అప్రమత్తం కావాల్సి ఉంటుందన్నారు. తాము నివసించే ప్రతీ అపార్ట్‌మెంట్‌నందు యుద్ధ సమయంలో సురక్షితంగా తలదాచుకునేందుకు బంకర్ ఉంటుందని, ప్రస్తుతం వాటిని వినియోగించుకుని క్షేమంగానే ఉన్నట్లు స్పష్టం చేశారు. కార్మికులు పనిచేసే సగటు రోజుల సంఖ్య ఏడు నుంచి నాలుగుకి తగ్గింది. కూరగాయలు, పాలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment