విధులు భారం.. నిధులు దూరం
● ఇబ్బంది పడుతున్న పంచాయతీ కార్యదర్శులు ● కొలువులో కొనసాగుతూనే ఇతర ఉద్యోగాల కోసం ప్రయత్నాలు ● జిల్లాలో క్రమంగా ఖాళీ అవుతున్న జీపీ కార్యదర్శి పోస్టులు ● ఐదేళ్లలో 83 మంది ఇతర ఉద్యోగాల వైపు..
నిర్మల్‌చైన్‌గేట్: ఒక గ్రామ పంచాయతీకి అధికారిగా.. వందలాది మంది ప్రజలకు సేవచేసే అవకాశం, గ్రామ రూపురేఖలు మార్చగలిగే గురుతర బాధ్యతలు పంచాయతీ కార్యదర్శికి మాత్రమే ఉంటాయి. ఇందులో భాగంగానే అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేపట్టిన సెక్రెటరీలు నిధులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కార్యదర్శి కంటే తక్కువ స్కేల్ ఉద్యోగమైనా ఫర్వాలేదన్నట్లుగా ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారిస్తున్నారు.
ఐదేళ్లలో 83 మంది..
జిల్లాలో నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసిన గత ప్రభుత్వం కార్యదర్శుల పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. 2019లో జిల్లాలో 289 మంది విధుల్లో చేరగా ఒత్తిడి పెరుగుతుండడంతో ప్రత్యామ్నాయ ఉద్యోగాలపై దృష్టి సారించారు. వేతనం, హోదా తక్కువైనా సరే చేరేందుకు సిద్ధమయ్యారు. ఇలా ఐదేళ్లలో 83 మంది కార్యదర్శులు కొలువులకు దూరమయ్యారు. ప్రారంభంలో ఫారెస్టు బీట్ ఆఫీసర్ పోస్టులు, ఆ తర్వాత గ్రూప్–4, ఏఎస్‌వో, స్టాఫ్ సెలక్షన్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, గురుకుల ఉద్యోగాల్లో చేరారు. తాజా డీఎస్సీలోనూ ముగ్గురు కార్యదర్శులు ఉపాధ్యాయ కొలువులు దక్కించుకున్నారు. ఇలా గత ఐదేళ్లలో 30 శాతం మంది ఇతర విధుల్లో చేరారు.
నిధుల లేమి కూడా సమస్యే..
గ్రామ పంచాయతీల అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2019 నుంచి క్రమం తప్పకుండా నిధులు మంజూరు చేశాయి. ఆయా నిధులతో పంచాయతీలను సుందరంగా తీర్చిదిద్దారు. ఇలా మూ డేళ్లు గడిచేసరికి నిధుల విడుదలలో జాప్యం ప్రారంభమైంది. దీంతో అత్యధిక పంచాయతీలలో ప్రజా ప్రతినిధులు తమ సొంత నిధులు పెట్టుబడిగా పె ట్టి పాలన సాగించారు. కొన్నిచోట్ల కార్యదర్శులకు సైతం ఆ బాధ్యత తప్పలేదు. ప్రస్తుతం పంచాయతీల్లో పాలకవర్గాలు లేకపోవడంతో కార్యదర్శులే ఖ ర్చులన్నీ భరించాల్సి వస్తోంది. ఈ బిల్లులు సకాలంలో అందక అప్పుల పాలవుతున్నారు. ఇక గత అలవాట్లకు అనుగుణంగా నిధుల కోసం కార్యదర్శుల పై పలు రూపాల్లో ఒత్తిడులు ప్రారంభమయ్యాయి. నిధులు విదల్చకుంటే మానసిక ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ సమయంలో అండగా నిలవా ల్సిన క్షేత్రస్థాయి అధికారులు పలాయనం చిత్తగించడంతో కార్యదర్శులు మనోవేదనకు గురవుతున్నా రు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు కార్యదర్శులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలూ ఉన్నాయి. మరికొందరు సెలవు పెట్టి ఇళ్లకే పరిమితం అవుతున్నారు.
జైరాంతాండ గ్రామ పంచాయతీ కార్యాలయం
2019 ఆగస్టులో జరిగిన నియామకాల ప్రకారం వివరాలు
ఖాళీలు : 322
ఇంటర్వ్యూకు హాజరైనవారు : 314
తిరస్కరించబడిన వారు : 11
ఆర్డర్ కాపీలు పొందినవారు : 303
విధుల్లో చేరిన వారు : 289
విధుల్లో చేరని వారు : 14
పెరుగుతున్న రాజకీయ ఒత్తిళ్లు..
పరిపాలన సౌలభ్యం కోసం గత ప్రభుత్వం 500 జనాభా ఉన్న తండాలను, గూడేలను పంచాయతీలుగా మార్చింది. ఇలా జిల్లాలో పాత, కొత్తవి కలిపి 396 గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి. ప్రతీ పంచాయతీకి ఒక కార్యదర్శిని నియమించారు. వారు తమ చెప్పు చేతల్లో ఉండాలంటూ రాజకీయ నాయకులు ప్రయత్నించడం, గ్రామస్తుల ముందే వారిని చిన్నచూపు చూడడం, తమ మాట వినడం లేదంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం వంటి వేధింపులు పెరిగాయి. ఇది కార్యదర్శులందరికీ వర్తించకపోయినా జిల్లాలో అనేక మంది ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో జిల్లాలో ప్రస్తుతం 13 పోస్టులు ఖాళీ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment