ఆ శాఖలు ఏం చేస్తున్నాయి..!?
నిర్మల్: జిల్లాలో చాలా శాఖల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తాజాగా జరిగిన ఫుడ్‌పాయిజన్ ఘటనలోనూ పలు శాఖల తీరుపై ఆరో పణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కేంద్రంలోని గ్రిల్ 9 రెస్టారెంట్‌లో ఈనెల 2, 3 తేదీల్లో తిన్నవారు తీవ్రఅస్వస్థతకు గురికాగా మధ్యప్రదేశ్‌కు చెందిన యువతి ఫూల్‌కాలీబైగా మృతి చెందిన విషయం తెలిసిందే. దాదాపు 50 మంది వరకు అస్వస్థతకు గురికాగా ఇప్పటికీ ఇద్దరు ముగ్గురి పరిస్థితి సీరియస్‌గానే ఉంది. ఈ ఘటన జరిగి రెండురోజులు దాటినా ఇప్పటికీ హోటల్‌పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
ఇష్టారీతిన హోటల్ దందాలు..
జిల్లా వ్యాప్తంగా హోటల్, రెస్టారెంట్, దాబాల నిర్వహణ ఇష్టారీతిన సాగుతోంది. అడిగేవారు లేకపోవడంతో వారు వడ్డించిందే ఆహారమన్నట్లుగా నడుస్తోంది. నాణ్యతలేని వంటనూనెలు, డాల్డాలు, కల్తీ నెయ్యి, నూడూల్స్ వినియోగిస్తున్నారు. మంచూరియా తయారీలో ఫుడ్‌కలర్స్ ఎక్కువగా వేసి, కుళ్లి న గోబీతో తయారు చేస్తున్నారు. ఇక మాంసాహా రం విషయంలోనైతే దారుణం. నిల్వఉంచిన చికెన్, మటన్, చేపలను పెడుతున్నారు. కుళ్లిన వాటినే మళ్లీ కడిగి వండి వడ్డిస్తున్నారు. ప్రధాన రోడ్లపై ఉండే దాబాలలోనూ రోజుల తరబడి చికెన్, మటన్‌లను ఫ్రిజ్‌లలో ఉంచుతూ వాటినే వండిస్తున్నారు. వండిన పాత్రలను శుభ్రం చేయకుండా అలాగే రోజుల తరబడి వాడుతుండటం మరీ దారుణం.
ఫుడ్‘సేఫ్టీ’.. ఎక్కడా..!?
ప్రజారోగ్య పరిరక్షణలో ఫుడ్‌సేఫ్టీ శాఖ చాలా కీలకం. కానీ.. జిల్లాలో ఈ శాఖ తీరు ఎప్పుడూ అనుమానస్పదంగానే ఉంటోంది. ఒకప్పుడు నాలుగైదు జిల్లాలకు కలిపి ఓ అధికారి ఉండేవారు. కొన్నేళ్లుగా జిల్లాకో ఫుడ్‌సేఫ్టీ అధికారిని నియమించారు. కానీ.. ఎప్పుడు ఏ అధికారి ఉంటారో తెలియదు. చాలా సందర్భాల్లో వ్యాపారులు చెప్పినట్లు అధికారులు నడుచుకుంటారన్న ఆరోపణలూ ఉన్నాయి. తాజాగా మయోనైజ్‌ను రాష్ట్రప్రభుత్వం నిషేధించి వారం గడుస్తున్నా.. ఇప్పటికీ జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగిస్తూనే ఉన్నారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణలోపం కారణంగానే ఇలాంటివి జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి.
వీలైనంత వరకు తినొద్దు..
ఫుడ్‌పాయిజన్ ఘటనలో నిషేధిత మయోనైజ్ తిన్నవారే ఎక్కువమంది బాధితులు ఉన్నారు. త్వరగా బాక్టీరియా చేరడానికి అవకాశం ఉండే ఇలాంటి పదార్థాలను వీలైనంత వరకు తినొద్దు. బయట ఫుడ్ తిన్నతర్వాత ఏమాత్రం వాంతులు, వీరేచనాలైనా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
– డాక్టర్ శశికాంత్, నిర్మల్
హోటళ్లలో నిషేధిత మయోనైజ్ వాడకం
జిల్లాలో ఘటనకు అదే కారణం
పెరుగుతున్న బాధితుల సంఖ్య
ఇప్పటికీ పలువురు సీరియస్
పర్యవేక్షణ లోపమే.. శాపమా..!?
హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాల ఏర్పాటుకు పర్మిషన్ ఇచ్చేముందు అవి నిబంధనల ప్రకారం ఉన్నాయా.. లేవా.. అని పరిశీలిస్తున్న దాఖలాలు లేవు.
మున్సిపాలిటీల్లో అధికారులు దాదాపు ఐదేళ్లలో ఒక్కసారి కూడా తనిఖీలు చేసిన సందర్భాలు లేవు. అప్పుడెప్పుడో మున్సిపల్ కమిషనరే బాధితుడు కావడంతో శ్రీలక్ష్మి గ్రాండ్ అనే హోటల్‌ను సీజ్ చేశారు. ఆ తర్వాత ఇప్పటికీ ఆ శాఖ వీటి వైపు చూడటం లేదు. ఇక రోడ్లపై పెట్టి పానీపూరి, బజ్జీమిర్చి, ఫాస్ట్‌ఫుడ్, చేపఫ్రై విక్రయించే వాటిపై అసలే పర్యవేక్షణ లేకపోవడం గమనార్హం. నిర్మల్, భైంసా, ఖానాపూర్ మూడు మున్సిపాలిటీల్లో సంబంధిత అధికారులు ‘మాములు’గానే తీసుకుంటారని, ఏదైనా ఘటన జరిగితే తూతూమంత్రంగా స్పందిస్తారన్న ఆరోపణలు ఉన్నాయి.
మయోనైజ్‌పై నిషేధం అమలు చేయించిందే వైద్యారోగ్యశాఖ. కానీ.. జిల్లాలో ఆ శాఖ తమకేం సంబంధం అన్నట్లుగా తమాషా చూస్తోంది. ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన సదరు అధికారులు తమ ఆస్పత్రుల్లోకి వస్తేనే పరిశీలిస్తామన్న తరహాలో ఉన్నారు. సదరుశాఖ మయోనైజ్ వినియోగాన్ని నిషేధించిన విషయాన్ని కూడా కనీసం ప్రచారం చేసిన దాఖలాలు లేవు.
చర్యలు తీసుకోవాలి..
ఫుడ్‌పాయిజన్ ఘటనపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించకపోవడం దారుణం. ఇలాంటివి జరగకముందే అధికారులు చర్యలు తీసుకోవాలి. జిల్లాలో చాలా హోటళ్లలో ఏమాత్రం శుభ్రత, నాణ్యత ఉండటం లేదు. వీటిపై వెంటనే స్పందించాలి. – పూదరి శివకుమార్, నిర్మల్
Comments
Please login to add a commentAdd a comment