సమస్యల పరిష్కారానికే వేదిక
● సీజీఆర్‌ఎఫ్ చైర్మన్ నారాయణ
లక్ష్మణచాంద: విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించేందుకే వేదిక ఏర్పాటు చేశామని సీజీఆర్‌ఎఫ్(కన్జ్యూమర్ గ్రీవెన్స్ రీగ్రేసివ్ ఫోరం)చైర్మన్ నారాయణ తెలిపారు. మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ఆవరణలో నిర్మల్ రూరల్ సబ్ డివిజనల్ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ విద్యుత్ సమస్యలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయని ఇందులో ఒకటి ఆర్థిక పరమైన సమస్యలు కాగా, రెండోది ఆర్థికపరమైనవి కాని సమస్యలు ఉంటాయన్నారు. ఆర్థికపరం కానీ సమస్యలను తమ దృష్టికి తెచ్చిన వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఆర్థికపరమైన సమస్యల పరిష్కారం కాస్త ఆలస్యం అవుతుందని తెలిపారు. సిటిజన్ చార్ట్ ప్రకారం విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. సమస్యలు ఉంటే సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు. సొంతంగా మరమ్మతులు చేపట్టొద్దని సూచించారు. రైతులు విద్యుత్ మోటార్లకు కెపాసిటర్లు బిగించుకోవాలని తెలిపారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి పొలంబాట కూడా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వేదికలో 10 మంది విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేశారు. నాలుగు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి టోల్‌ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేయాలని సూచించారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వవద్దని సూచించారు. కార్యక్రమంలో సీజీఆర్‌ఎఫ్ టెక్నికల్ సభ్యుడు రామకృష్ణ, ఫైనాన్స్ సభ్యుడు కిషన్, డీఈ నాగరాజు, ఏడీఈ వెంకటపతిరాజు, వివిధ మండలాల ఏఈలు మహేశ్, సాయికిరణ్, రాజేందర్, శంకర్ విద్యుత్ సిబ్బంది, వివిధ గ్రామాల నుంచి వచ్చిన విద్యుత్ వినియోగదారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment