పరేషాన్‌లో ‘ప్రసూతి’
● ఎంసీహెచ్‌లో గైనకాలజిస్టుల కొరత ● తరచూ సంభవిస్తున్న శిశు మరణాలు ● దాడులతో దూరమవుతున్న వైద్యులు ● ఇబ్బందుల్లో గర్భిణులు, బాలింతలు
నిర్మల్: జిల్లాలో ఎప్పటి నుంచో ఉన్న ఏకై క ప్రసూ తి ఆస్పత్రి ఇప్పటికీ పురిటినొప్పులు ఎదుర్కొంటూనే ఉంది. ఇక్కడికి వచ్చేదే ప్రసూతి కోసం. కానీ.. సంబంధిత గైనకాలజిస్టులు సరిపడా లేక గర్భిణులు, బాలింతలు ఇబ్బంది పడుతున్నారు. వివిధ కారణాలతో ఇటీవల పసికందులు మృతిచెందడం, సంబంధిత బంధువులు దాడులకు పాల్పడటంతో కంగారుపడుతున్న ఎస్‌ఆర్ (సీనియర్ రెసిడెంట్)లు తమ విధులు మానుకోవడం కలవరపెడుతోంది. నిర్మల్‌లోని మాతాశిశు సంక్షేమ ఆస్పత్రి (ఎంసీహెచ్) మెడికల్ కాలేజీ (డీఎంఈ) పరిధి లోకి రావడంతో ఇందులో ఉండటానికి సీనియర్ వైద్యులు ఇష్టపడటం లేదు. పోస్టుల ప్రకారం వైద్యులు లేక, సేవలందించే ఎస్‌ఆర్‌లూ వెళ్లిపోవడంతో ఇక్కడ ఉన్నవారిపైనే భారం పడుతోంది. దీంతో ప్రసూతి సేవలపై ప్రభావం చూపుతోంది.
వందల్లో ప్రసవాలు
కడెం నుంచి బాసర వరకు జిల్లాలోని అన్ని మండలాలతో పాటు పక్కనున్న ఆదిలాబాద్‌లోని బోథ్, నేరడిగొండ ప్రాంతాల నుంచీ గర్భిణులు నిర్మల్ ప్రసూతి ఆస్పత్రికి వస్తుంటారు. ఆస్పత్రుల్లోనే ప్రసవాలు చేయించాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం పెట్టడంతో ఆశ కార్యకర్తలు ప్రతీ గ్రామం నుంచి గర్భిణులను ఇక్కడికే తీసుకువచ్చి డెలివరీ చేయిస్తున్నారు. ఈక్రమంలో ఇక్కడ నెలకు 250నుంచి 350వరకు ప్రసవాలు అవుతున్నాయి. సగటున రోజుకు 10పైనే ప్రసవాలు చేయాల్సి వస్తోంది. ఒక్కోసారి 15నుంచి 20వరకు చేసిన సందర్భాలున్నాయి.
ఇక్కడున్నది కొందరే..
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పరిధిలోని మాతాశిశు ఆరోగ్యకేంద్రంలో 12మంది గైనకాలజిస్ట్‌లు ఉండాలి. అందులో ఒకరు హెచ్‌వోడీ, ఇద్దరు ప్రొఫెసర్లు, నలుగురు అసిస్టెంట్‌లు, మిగతా వారు అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండాలి. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా ఇక్కడి నుంచి చాలామంది వైద్యులు వెళ్లిపోయారు. మెడికల్ కళాశాల (డీఎంఈ) పరిధిలోకి రావడానికి చాలామంది వైద్యులు విముఖత చూపుతున్నారు. ప్రస్తుతం ప్రసూతి ఆస్పత్రిలో రెగ్యులర్ ఒకరు, కాంట్రాక్ట్ ప్రాతిపదికన ముగ్గురు వైద్యులు మాత్రమే ఉన్నారు.
ఇబ్బందుల్లో గర్భిణులు
ఆస్పత్రికి వస్తున్న గర్భిణులకు సరిపడా వైద్యులు లేక ఉన్నవారిపైనే పనిభారం పడుతోంది. ప్రస్తుతం సూపరింటెండెంట్‌గా ఉన్న ప్రొఫెసర్ ఒక్కోసారి ఇదే ఆస్పత్రిలోనే మెడికోలకు క్లాసులు తీసుకోవాల్సి వస్తోంది. ఉన్న ముగ్గురు నలుగురు వైద్యుల్లో ఒకరు ఓపీలో, మరొకరు డెలివరీల్లో ఉండటంతో గర్భిణులు, బాలింతలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. ఈ నేపథ్యంలో పాలకులు, సంబంధిత అధికారులు ఎంసీహెచ్‌లో ప్రసూతి సేవలపై దృష్టిపెట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు.
తగిన సేవలందిస్తున్నాం
జిల్లాకేంద్రంలోని ప్రసూతి ఆస్పత్రికి గర్భిణులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. వారికి తగిన వైద్యసేవలు అందిస్తున్నాం. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ అయితే మరింత మెరుగ్గా సేవలందించే వీలుంటుంది.
– డాక్టర్ సరోజ, ప్రసూతి ఆస్పత్రి హెచ్‌వోడీ
ఎంసీహెచ్‌లో ప్రసవాల వివరాలు
నెల సిజేరియన్ సాధారణ మొత్తం
జనవరి 234 105 339
ఫిబ్రవరి 166 87 253
మార్చి 180 119 299
ఏప్రిల్ 175 108 283
మే 181 102 283
జూన్ 178 76 254
జూలై 218 96 314
ఆగస్టు 257 96 353
సెప్టెంబర్ 231 90 321
అక్టోబర్ 263 94 357
వైద్యుల విముఖత
మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ముందు ప్రసూతి ఆస్పత్రి తెలంగాణ వైద్యవిధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలో ఉండేది. దీని పరిధిలో ఏళ్లపాటు సీనియారిటీ కలిగిన వైద్యులుండేవారు. మెడికల్ కాలేజీ ఏర్పాటైన తర్వాత జిల్లా ప్రధాన ఆస్పత్రి, దాని పరిధిలోని ప్రసూతి ఆస్పత్రి కూడా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోకి వెళ్లాయి. అప్పటికే టీవీవీపీ పరిధిలో ఉన్న వైద్యులు డీఎంఈ పరిధిలోకి రావాలంటే సర్వీస్ లాస్ అవుతుండటంతో వారంతా ఇక్కడ ఉండటానికి విముఖత చూపించారు. దీంతో సీనియర్ వైద్యులంతా భైంసా, ఖానాపూర్, నర్సాపూర్ ఆస్పత్రులు, ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లారు. ఈక్రమంలో స్థానిక ఆస్పత్రుల్లో వైద్యుల కొరత ఏర్పడింది. ఎంసీహెచ్‌లోనూ ప్రస్తుతం ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ ఇటీవల జరుగుతున్న పలు ఘటనలు వాటిపై సంబంధీకులు స్పందించిన తీరుపైనా జూనియర్ వైద్యులు కంగారు పడుతున్నారు. ఇటీవల జరిగిన ఘటన నేపథ్యంలో ఇక్కడ తమకు రక్షణ లేదంటూ తాజాగా ముగ్గురు సీనియర్ రెసిడెంట్ (ఎస్‌ఆర్)లు వెళ్లిపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment