సమీకృత గురుకులం
● రెండువిడతల్లో జిల్లాకు మొండిచేయి ● మలివిడతలోనైనా మంజూరయ్యేనా?
భైంసాటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాలన్నీ కలిపి ఒకే ప్రాంగణంలో నియోజకవర్గానికో యంగ్ ఇండియా సమీకృత గురుకులం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్ మినహా వంద నియోజకవర్గాల్లో వీటిని నిర్మించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా మొదటి విడతలో 28, రెండో విడతలో 26 నియోజకవర్గాలకు గురుకులాల ను మంజూరు చేసింది. మొదటివిడతలో మంచిర్యాల జిల్లాకు ఒకటి, రెండోవిడతలో పక్కనే ఉన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు నాలుగు సమీకృత గురుకులాలు రాగా, ఈ రెండు విడతల్లోనూ జిల్లాకు చోటు దక్కలేదు. జిల్లా విద్యాశాఖ నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం ప్రతిపాదనలు కోరలేదని అధికారులు చెబుతున్నారు. మలి విడతల్లో మంజూరయ్యే అవకాశముందని పేర్కొంటున్నారు. దీంతో సమీకృత గురుకులాలు ఏర్పాటైతే జిల్లాలోని అన్ని గురుకులాలు ఒకే ప్రాంగణంలోకి రానున్నాయి. తద్వారా విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.
జిల్లాలో ఇలా..
జిల్లాలో ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కస్తూర్బా, మోడల్, సోషల్ వెల్ఫేర్, ట్రైబర్ వెల్ఫేర్ అన్నీ కలిపి 56 గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఉండగా, వీటిలో 21,111 మంది విద్యార్థులు చదువుతున్నారు. కొన్నింటిలో ఒక టి నుంచి, మరికొన్నింటిలో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యనందిస్తున్నారు. చాలావాటికి సొంత భవనాలు లేక అరకొర వసతుల కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేగాక, ప్రభుత్వం కూడా అద్దె భవనాలకు ఏటా రూ.కోట్లలో వెచ్చించాల్సి వస్తోంది. దీనికితోడు ఆయా గురుకులాల్లో బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీలతో పూర్తిస్థాయిలో విద్య అందడం లేదు. ఈ నేపథ్యంలో 20–25 ఎకరాల సువిశాల స్థలా ల్లో సమీకృత గురుకుల పాఠశాలలు ఏర్పాటైతే విద్యార్థులకు వసతుల లేమి తొలగడంతోపాటు పూర్తిస్థాయిలో మెరుగైన విద్య అందనుంది.
ప్రతిపాదనలు కోరలేదు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర గురుకులాలన్నీ ఒకే చోట ఉండేలా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు 54 పాఠశాలలు మంజూరు చేసింది. జిల్లాలో ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రతిపాదనలు కోరలేదు. – రామారావు, డీఈవో
జిల్లాలోని గురుకులాల వివరాలు
విద్యాసంస్థ సంఖ్య విద్యార్థులు
కేజీబీవీలు 18 5,960
అర్బన్ రెసిడెన్షియల్‌లు 1 107
టీఎస్ మోడల్ స్కూళ్లు 1 131
మైనారిటీ వెల్ఫేర్ స్కూళ్లు 5 2,089
ఎంజేపీ (బీసీ)లు 7 4,078
టీఎస్‌ఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌లు 5 3,200
టీఎస్‌టీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌లు 1 546
టీఎస్‌ఆర్‌ఈఐఎస్‌లు 1 643
టీడబ్ల్యూ ఆశ్రమ పాఠశాలలు 17 4,357
Comments
Please login to add a commentAdd a comment