ధ్రువపత్రాల కోసం తహసీల్‌ చుట్టూ చక్కర్లు | Sakshi
Sakshi News home page

ధ్రువపత్రాల కోసం తహసీల్‌ చుట్టూ చక్కర్లు

Published Fri, May 17 2024 9:05 AM

-

ఆఫీస్‌లో 250 దరఖాస్తుల పెండింగ్‌

బిచ్కుంద(జుక్కల్‌): మండల ప్రజలు, రైతులు ఆయా ధ్రువపత్రాలు, పహాణీ రికార్డుల కోసం నెలల తరబడి తహసీల్‌ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అధికారులు పరిశీలన, విచారణ పేరుతో నెలల తరబడి కాలయాపన చేస్తుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వందల దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోక పెండింగ్‌లో ఉన్నాయి. అధికారులు సమయ పాలన పాటించడం లేదు. ఓ అధికారి బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు కార్యాలయానికి వచ్చారు. ఆ అధికారి చిక్కడు దొరకడు అన్న రీతిలో ఉంటారు. ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియని పరిస్థితి నెలకొందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పహాణీ రికార్డులు, కులం, ఆదాయం, బర్త్‌ సర్టిఫికేట్‌, నివాస ధ్రువీకరణ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, ఫ్యామిలీ సర్టిఫికెట్‌ ఇతర ధ్రువీకరణ పత్రాల కోసం ప్రజలు దరఖాస్తులు చేసుకోగా వాటి పరిష్కారానికి నోచుకోక తహసీల్‌ కార్యాలయంలో సుమారు 250 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

ఎండను సైతం లెక్క చేయకుండా ప్రతి రోజూ కార్యాలయం చుట్టూ విద్యార్థులు, ప్రజలు చక్కర్లు కొడుతున్నా కనికరించే వారు కరువయ్యారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి దారితప్పిన రెవెన్యూ పాలనను సరైన మార్గం తీసుకొచ్చి అన్ని వేళలో అధికారులు స్థానికంగా ఉండే విధంగా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement